శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 మే 2015 (19:38 IST)

జగన్ పార్టీ వైకాపాలో చేరనున్న బొత్స సత్తిబాబు.. ఫలించిన నేతల కృషి!

కరుడుగట్టిన కాంగ్రెస్‌వాది, పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి, సీమాంధ్రలో కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన బొత్స సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు వైఎస్ఆర్ సీపీలో చేరనున్నారు. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో సత్తిబాబు పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. 
 
మరోవైపు వైకాపాలో చేర్పించేందుకు జగన్ పార్టీ నేతలు పలువురు బొత్సతో క్రమం తప్పకుండా చర్చలు జరుపుతూ వచ్చారు. ఈక్రమంలో శుక్రవారం కూడా వైకాపా నేతలు మిథున్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కారుమూరి, విజయసాయి రెడ్డిలు బొత్స నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా మంతనాలు జరిపారు. ఈ మంతనాల్లో బొత్స పార్టీలో చేరే తేదీపై చర్చించినట్టు సమాచారం. 
 
వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో బొత్సతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు చిత్తుగా ఓడిపోయిన తర్వాత బొత్స వైకాపాలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగగా, ఈ వార్తలను ఆయన ఖండించారు. ఈనేపథ్యంలో.. వైకాపా నేతలు చేసిన కృషి, రాయబారం ఫలించడంతో జగన్‌తో కలిసి పని చేసేందుకు బొత్స సత్యనారాయణ సమ్మతించారు. అయితే, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.