శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (14:09 IST)

ప్రత్యేక హోదాపై సుప్రీంను ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది.. ఏపీ సర్కారు యోచన

రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రాబట్టుకునేందుకు ఏపీలోని టీడీపీ సర్కారు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. విభజన సమయంలో పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒప్పుకున్న క్రమంలో దాన్ని సాధించేందుకు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందనట్టు వార్తలు వెలువడుతున్నాయి. 
 
ఇటీవల లోక్‌సభలో కేంద్ర ప్రణాళిక శాఖామంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ చేసిన ప్రకటనతో ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని తేటతెల్లం చేసినట్టయింది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? ప్రస్తుతం అందర్లోనూ ఇదే ప్రశ్న. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఇప్పటికే ఓ కేంద్ర మంత్రి చెబితే... ప్రత్యేక హోదా కోసం కసరత్తు చేస్తున్నామని మరో కేంద్ర మంత్రి చెప్పారు.
 
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపై ఏపీ సర్కారు ఆరా తీస్తోంది. యూపీఏ ప్రభుత్వ అధినేతగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో ప్రత్యేక హోదా ప్రకటన చేసినందున... దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందనే కోణంలో సర్వోన్నత న్యాయస్థానంలో దావా వేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. 
 
అయితే, కోర్టుమెట్లేక్కేపని అయితే, తమ మిత్రపక్షమైన బీజేపీకి ఇబ్బంది కలుగని రీతిలో ముందుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తుంది. ముందుగా బీజేపీ పెద్దలకు ఈ విషయాన్ని చెప్పి, ఆ దిశగా అడుగు వేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యత కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అప్పగించినట్టు సమాచారం.