గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2014 (09:45 IST)

జేసీ ప్రభాకర్‌ నోటిదూల.. కేసు నమోదు.. ఉద్రిక్తత... ఉపసంహరణ!

భారతీయ స్టేట్ బ్యాంకు మహిళా మేనేజర్‌ను దూషించిన కేసులో తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. జేసీపై ఫిర్యాదు చేసిన బ్యాంకు అధికారులకు సర్ది చెప్పడంతో వారు కేసును వాపసు తీసుకున్నారు. దీంతో పరిస్థితులు సద్దుమణిగాయి. 
 
స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం దగ్గర చెత్త విపరీతంగా పేరుకుపోతోందని, దాన్ని శుభ్రం చేయాలని బ్యాంకు అధికారులతో ప్రభాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దాంతో బ్యాంకు అధికారులు ఆయన మీద కేసు పెట్టారు. తన మీద కేసును నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్బీఐ బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే ఆందోళనకు మద్దతుగా భారీగా ప్రజలు తరలి వచ్చి బ్యాంకు ముందు చాలాసేపు ధర్నా చేపట్టారు. 
 
దాంతో పోలీసులు భారీగా మోహరించారు. తాడిపత్రి అట్టుడికిపోయింది. తాను తాడిపత్రి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపడితే బ్యాంకు అధికారులు తన పైన కేసు పెట్టడమేమిటని జేసీ ప్రశ్నించారు. ఎట్టకేలకు బ్యాంకు అధికారులు జేసీ ప్రభాకరరెడ్డి మీద కేసు ఉపసంహరిచుకోవడంతో వివాదం సర్దుమణిగింది.