శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (11:07 IST)

ఏటీఎంలో చెత్త.. బ్యాంకు మేనేజర్‌పై తిట్ల పురాణం : జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు!

ఓ ఏటీఎం కేంద్రంలో చెత్త ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏటీఎం సెంటర్‌కు తాళాలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు మహిళా బ్యాంకు మేనేజర్ ఆయన ఇంటికి వెళ్లగా తిట్ల పురాణం అందుకున్నాడు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై బ్యాంకు మేనేజర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. మూడు రోజుల క్రితం తాడిపత్రిలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎం వద్ద చెత్త ఎక్కువగా పడి ఉండడం చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డికి విపరీతమైన ఆగ్రహం వచ్చింది. వెంటనే ఏటీఎంకు తాళాలు వేసి ఇంటికి తీసుకొచ్చేశారు. దీంతో విషయం తెలిసిన ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ సుప్రజ సిబ్బందితో కలిసి తాళం తీసుకోవడానికి జేసీ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జేసీ బ్యాంకు సిబ్బందిపై తిట్ల పురాణం అందుకున్నారు. జేసీ తిట్లతో అవాక్కయిన చీఫ్ మేనేజర్ సుప్రజ డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
 
మునిసిపాలిటీ అభివృద్ధికి విరాళం ఇవ్వలేదని ఎమ్మెల్యే తమను దూషించారని... తనతో పాటు బ్యాంకుకు కూడా జేసీ బ్రదర్స్ నుంచి భద్రత కల్పించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు అనేక తర్జనభర్జనలు పడి చివరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసును నమోదు చేసుకున్నారు.