గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (17:50 IST)

వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత చెప్పిన ఆ 15 మంది అనుమానితులు ఎవరు?

వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగం పుంజుకుంది. ఈ కేసును టేకప్ చేసిన సీబీఐ... దర్యాప్తును శరవేగంగా సాగిస్తోంది. ఇందులోభాగంగా, అనేకమందిని విచారిస్తోంది. తాజాగా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత వద్ద మూడు గంటల పాటు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆమె అనుమానం ఉన్న 15 మంది పేర్లను సీబీఐ అధికారులకు చెప్పింది. వారి పేర్లను సీబీఐ అధికారులు నమోదు చేసుకున్నారు. అలాగే, ఆమె సమర్పించిన ఆధారాలు, డాక్యుమెంట్లను కూడా ఆమె తీసుకున్నారు. 
 
కాగా, తన హత్య కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు సంస్థపై తనకు నమ్మకం లేదని, సీబీఐ చేత కేసును విచారించాలంటూ హైకోర్టును సునీత ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో, పిటిషన్‌లో ఆమె పేర్కొన్న వివరాలను సీబీఐ అధికారులు తెలుసుకున్నారు. తనకు అనుమానం ఉన్న 15 మంది వ్యక్తుల పేర్లను కూడా తెలిపారు. మరోవైపు సస్పెన్షన్‌కు గురైన పులివెందుల సీఐ శంకరయ్యను సీబీఐ అధికారులు రెండో రోజు విచారించారు. సోమవారం కూడా ఆయనను నాలుగు గంటల సేపు విచారించారు. వివేకా హత్య జరిగిన సమయంలో శంకరయ్య సీఐగా ఉన్న విషయం తెల్సిందే.