శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (09:24 IST)

బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగింది.. నేనే మాట్లాడతా : వెంకయ్య

సాధారణ బడ్జెట్‌లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, ఇదే అంశంపై తానే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడనున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేంద్ర బడ్జెట్‌లో తమకు సరైన న్యాయం జరగలేదని ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు. దీంతో, బాబు ఆవేదనను తాము అర్థం చేసుకుంటామని వెంకయ్య చెప్పారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో ఏపీకి సరైన న్యాయం జరగలేదని చంద్రబాబు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని తాము తప్పుపట్టడం లేదని చెప్పారు. అయితే, దీనిపై బహిరంగంగా చర్చించే కంటే కలిసి కూర్చుని మాట్లాడుకుంటే మంచిదని హితవు పలికారు.
 
‘వారు ఏమి అడిగారు.. మేము ఏమి ఇచ్చాం.. వీటిపై కేంద్ర ఆర్థిక మంత్రి ముందు కూడా వారి వాదనను వినిపించవచ్చు’ అని చెప్పారు. బడ్జెట్‌లో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకీ ఇచ్చిన అన్ని హమీలకూ కేంద్రం కట్టుబడి ఉందన్నారు. వీటిని అమలు చేయడంలో ఏర్పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. అందువల్ల, ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టిందనే అభిప్రాయం సరికాదని చెప్పారు. ప్రతి విషయాన్నీ బడ్జెట్‌లో పొందుపర్చలేమని.. అలాగే ప్రతి విషయాన్నీ బహిరంగంగా చెప్పలేమని వ్యాఖ్యానించారు.
 
‘పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.100 కోట్లు కేటాయించడం చంద్రబాబును ఆవేదనకు గురి చేసి ఉండొచ్చు. పోలవరానికి కేటాయింపులను పెంచాలని నేను కూడా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని కోరతాను అని చెప్పారు. ఏపీ రాజధాని నిర్మాణానికి పట్టణాభివృద్ధి శాఖ తరపున కొన్ని నిధులను రిజర్వ్‌ చేసి పక్కనపెట్టామన్నారు. ‘రాజధానికి భూమిని గుర్తించాలి. నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలి. వాటిని పరిశీలించిన తర్వాత ఎంత ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని వెంకయ్య వివరించారు. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్‌ని ప్రకటించకపోవడంపైనా అనుమానాలు అవసరం లేదని చెప్పారు. ఏపీకి తప్పనిసరిగా ప్రత్యేక రైల్వే జోన్‌ను ఇవ్వాల్సి ఉందన్నారు.