శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2015 (12:26 IST)

పీఎంతో భేటీ తేల్చిందేమిటి..? జైట్లీ చెప్పిందేమిటి? బాబుకు క్లారిటీ వచ్చిందా..?!

ఆంధ్రప్రదేశ్‌కు అయితే ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ.. అట్లా ఇట్లా కాదు. ఎక్కడా లేని రీతిలో సాధిస్తామని తెలుగుదేశం, బీజేపీ నాయకులు జబ్బలు చరుచుకుని మరి చెప్పారు. అన్ని భేటీలోనే తేల్చుకుంటామని ప్రగల్భాలు పలికారు. తమ నాయకుడు చంద్రబాబు కేంద్రంతో తాడోపేడో తేల్చుకునే వస్తారని చెప్పారు. మరి సాధించిందేమిటీ..? వారి ఇచ్చిందేమిటి..? బాబు తెచ్చింది ఏమిటి..? చేతులూపుకుంటూ వెళ్ళి... ఖాళీ చేతులతో రావడం మినహా ఆంధ్రప్రదేశ్‌కు ఒరిగిందేమిటి? ఎన్నడూ లేని విధంగా భేటీ అనంతరం అరుణ్ జైట్లీ విలేకరుల ముందుకు వచ్చి ఏమి చెప్పారు..? అది చంద్రబాబు బుర్రకు ఎక్కిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
అధికారం రాకమునుపు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీలు రెండూ ప్రత్యేక హోదాపైనా, ప్యాకేజీపై హామీల వర్షం గుప్పించాయి. అక్కడ మోదీ ఇక్కడ చంద్రబాబు ఇద్దరూ అధికారంలోకి రానే వచ్చారు. అది కూడా ఒకటిన్నర యేడాది గడిచిపోతోంది. అయితే ఫలితం ఏంటి? ఇదే ప్రశ్న ప్రతిపక్షాలు పదే పదే ప్రశ్నించాయి. ప్రత్యేక హోదాపై గళం విప్పాయి. ఈ లోపు బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం పుండుమీద కారం చల్లినట్లు అయ్యింది. మునుకోటి ఆత్మబలిదానంతో ప్రత్యేక హోదా రోడ్డెక్కింది. ఇక చంద్రబాబుకు వేడి పుట్టింది. అప్పటికే మోదీతో పలుమార్లు సమావేశమైన చంద్రబాబు బయటకు వచ్చి సమావేశ వివరాలను చెప్పేవారు. 
 
ప్రత్యేక వేడితో తిరిగి ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని ముందు పెట్టారు. ప్రత్యేకహోదా ఎందుకు కావాలో చెప్పారు. అలాగే ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు అవసరమో వివరించారు. అన్ని సావదానంగా విన్న కేంద్రం ఏం తేల్చింది అంటే ఏమి తేల్చేలేదు. ప్రత్యేక హోదా దాదాపుగా లేనట్టే. పైకి పరీశీలిస్తున్నామని చెప్పినా.. దాదాపుగా దానిని అటకెక్కించారు. అలాంటప్పుడు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించవచ్చు కదా..? అదీ లేదు. ఎందుకు? అదే రాజకీయం.
 
తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీల మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తోంది. అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఆర్థిక సాయం అందిస్తే భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకున్నట్టేననే విషయం భారతీయ జనతాపార్టీకి స్పష్టంగా తెలుసు. ఇప్పటికిప్పుడు చంద్రబాబు అడిగిన ప్రత్యేక హోదా లేదా.. ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చి పంపితే ఇక చంద్రబాబును పట్టపగ్గాలు ఉండవనే విషయం బీజేపీ నాయకులకు స్పష్టంగా తెలుసు. అలాగని ఏమి చెప్పకుండా పంపితే చంద్రబాబు బయట ఎటువంటి సంకేతాలిస్తాడో. అందుకే ఈ పర్యాయం బీజేపీ తన సందేశాన్ని నేరుగా జనానికి ఇచ్చింది. భేటీ తరువాత స్వయంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీనేవిలేకరుల ఎదుటకు వచ్చారు. గతంలో ఆ స్థాయిలో ఉన్న నాయకుడు ప్రధానితో భేటీ తరువాత చంద్రబాబుతో కలసి మీడియా ముందుకు రాలేదు. 
 
వచ్చిన తరువాత కూడా పదే పదే ఆయన చెప్పిన విషయం ఒక్కటే ఇచ్చేదేదో నేరుగా ప్రధాన మంత్రే ప్రకటిస్తారని చెప్పారు. చట్టంలోని అన్నింటిని అమలు చేస్తామని చెబుతూనే మోదీ మాట పదే పదే చెప్పడం విశేషం. అంటే ఇక ఇతరులు చేసే ప్రకటనలకు... హామీలకు కేంద్రంతో ఎటువంటి సంబంధం లేదనే అర్థ స్పురిస్తుంది. పైగా బాబు కూడా ఎక్కడా పెద్దగా నోరు మెదపలేదు. అంటే బాబును బీజేపీ పూర్తి స్థాయిలో విశ్వాసంలోకి తీసుకున్నట్లు లేదనే విషయం స్పష్టం అవుతోంది. తిరుపతిలో సభ పెట్టి అక్కడే ప్రకటిస్తామంటే అర్థం ఏంటి? ఇచ్చే ప్రతీ పైసా కూడా బీజేపీ ఇచ్చిందే అనే సారాంశాన్ని జనంలోకి పంపేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేసుకుంటోంది. రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు ఆ మాత్రంత అర్థం చేసుకోలేడా...?