శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (20:18 IST)

నాగరికత పెరగడంతో వాతావరణంలో మార్పులు.. మొక్కలు నాటండి : చంద్ర బాబు

ఒకప్పుడు గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేదని కాలక్రమేణా నాగరికత పెరగడంతో వాతావరణంలో సమతుల్యత దెబ్బతినిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అందువల్లనే వాతావరణంలో రకరకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. రాష్ట్ర విభజన వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కట్టుబట్టులతో బయటకు వచ్చాం.. కాబట్టి విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటీనీ నెరవేర్చాలని తెలిపారు. 
 
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని రాజధాని ప్రాంతమైన అనంతవరం గ్రామంలో కార్తీక వనమహోత్సవం కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గత సంవత్సరం విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసిన హుద్‌ హుద్‌ తుఫాన్‌, ప్రస్తుతం నెల్లూరు జిల్లాను కుదిపేస్తున్న వర్షాలే ఇందుకు ఉదాహరణని సీఎం తెలిపారు. 
 
ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచినప్పుడే సమసమాజ నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. అప్పుడే రాషా్ట్రన్ని కరువు రహితంగా మార్చవచ్చన్నారు. మొక్కలను నాటి పెంచే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చెట్లు ఉన్న చోట ఆరోగ్యం, నీరు ఉన్న చోట నాగరికత ఉంటుందని తెలిపారు. 
 
మొక్కలను పెంచేందుకు గ్రీన కార్ప్‌ ఆర్గనైజేషన ద్వారా పిల్లలను ఒక సైన్యంలా తయారు చేయాలని, మొక్కల పెంపకంపై గ్రామాలు, స్కూళ్లు, కాలేజీల్లో చర్చ జరగాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. జపాన్, సింగపూర్‌ వంటి దేశాల్లో మనిషిని చంపితే ఎంత నేరమో చెట్లను నరికినా అంతే నేరమన్నారు.