శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (11:49 IST)

రావెళ్ళ తలచుకుంటే ప్రత్తిపాటి మంత్రి పదవి పోతుందట.. ఎలా..!

మంత్రి పదవులు పోవాలంటే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి. కానీ మంత్రులు అనుకుంటే పదవి ఎలా పోతుంది అనుకుంటున్నారు. ఇది నిజమే., ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో కొంతమంది మంత్రులను తీసేయ్యాలని చంద్రబాబు అనుకుంటున్

మంత్రి పదవులు పోవాలంటే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి. కానీ మంత్రులు అనుకుంటే పదవి ఎలా పోతుంది అనుకుంటున్నారు. ఇది నిజమే., ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో కొంతమంది మంత్రులను తీసేయ్యాలని చంద్రబాబు అనుకుంటున్న తరుణంలో ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారట. అందులో ఇద్దరు నేతల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వారే రావెళ్ళ, ప్రత్తిపాటి పుల్లారావులు.
 
గుంటూరు జిల్లాకు సంబంధించి వేటుపడే వారిలో మంత్రి రావెళ్ళ కిషోర్ బాబు పేరు ముందు వరుసలో ఉంటోంది. అక్కడే వచ్చింది అసలు సమస్య. ఈ విషయంపై రావెళ్ళ కిషోర్ బాబు పార్టీ నాయకుల వద్ద చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తనవైపున ఏదైనా తప్పు జరిగింది అంటే పార్టీకి కొత్త కాబట్టి నాయకులతో కొన్ని సమస్యలు వచ్చాయని ఆయన కూడా అంగీకరిస్తున్నారు. అదే ప్రత్తిపాటి పుల్లారావు విషయంలో ప్రతికూల అంశాలు ఎన్నో ఉన్నాయని.. అన్ని ప్రతికూల అంశాలు ఉన్న పుల్లారావును వదిలేసి.. తనను ఒక్కడినే ఎలా టార్గెట్ చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
 
తన కుటుంబ సభ్యలు ఎవరూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంలేదని.. అదే వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావు కుటుంబ సభ్యులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని రావెళ్ల పార్టీ నాయకుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. తన శాఖపై పెద్దగా అవినీతి ఆరోపణలు ఏమీ లేవని.. అదే పుల్లారావు సారథ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖకు సంబంధించి నకిలీ విత్తనాలు మొదలుకుని పలు అక్రమాలు జరిగాయని చెబుతున్నారు. 
 
దీంతో పాటు పుల్లారావు చేసే భూసంబంధ సెటిల్‌మెంట్లు జిల్లా అంతటా పెద్ద దుమారం రేపుతున్నాయనేది ఆయన వాదన. పుల్లారావు రాజధాని భూముల వ్యవహారాల్లో గోల్‌మాల్ చేయటంతో పాటు… చిలకూరిపేట ప్రాంతంలో మైనింగ్ కోసం దళితులు.. అసైన్‌మెంట్ భూములను పుల్లారావు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
 
దీనికితోడు మంత్రి పదవి పొందటానికి తాము భారీ ఎత్తున డబ్బు ఇఛ్చామని…. ఆరోపణల పేరుతో తమను ఎలా తీసేస్తారని.. తీసేస్తే ఊరుకుంటామా? అని పుల్లారావు భార్య పార్టీ నాయకుల వద్ద వ్యాఖ్యానించారని జోరుగా ప్రచారం జరిగింది. ఇన్ని అంశాలు ఉన్న పుల్లారావును కాదని.. తన ఒక్కడిపై వేటు ఎలా వేస్తారని రావెళ్ల కిషోర్ బాబు ప్రశ్నిస్తున్నారు. దీంతో గుంటూరు రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింత రసకందాయంలో పడే సూచనలు కన్పిస్తున్నాయి. తొలగిస్తే ఎక్కువ ఆరోపణలు ఉన్న వారిని తొలగిస్తారా? లేక తక్కువ ఆరోపణలు ఉన్న వారిని తొలగిస్తారా? అని రావెళ్ల ప్రశ్నిస్తున్నారు. ఇది ఏ రూపు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.