శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 30 మే 2015 (06:28 IST)

కేంద్ర కమిటీ అధ్యక్షుడుగా చంద్రబాబు ప్రమాణం

తెలుగుదేశం పార్టీ  జాతీయ పార్టీగా రూపు దిద్దుకుంది. పార్టీ ఆవిర్భవించించిన తరువాత తన 34వ మహానాడు ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కేంద్ర కమిటీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మహానాడులో ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత పార్టీ సీనియర్‌ నేత పెద్ది రెడ్డి ప్రమాణం చేయించారు. ‘‘నారా చంద్రబాబు నాయుడు అను నేను తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షునిగా రాగద్వేషాలకు తావు లేకుండా, కుల, మత ప్రాంతీయతలకు అతీతంగా నాకు అప్పగించబడిన విధులను మనసా, వాచా, కర్మేనా, నీతివంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 
 
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావానికి అనుగుణంగా, ప్రజల అభిష్ఠం మేరకు శాయిశక్తుల కృషి చేస్తానని, తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠను పెంచడానికి, నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలుగు దేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షునిగా రాష్ర్టాలలో వ్యవసాయదారుల, వ్యవసాయ కూలీల, మహిళల, యువత, బడుగు, బలహీన వర్గాల, చేతి వృత్తుల, కుల వృత్తుల, కార్మిక వర్గాల, అల్ప సంఖ్యాక వర్గాల, పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల అభ్యున్నతికి విజ్ఞానవంతమైన, ఆదర్శవంతమైన ఆర్థిక అసమానతలు లేని సుసంపన్నమైన సమాజ స్థాపనకు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, రాష్ర్టాల సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’’ అని ఆయన ప్రమాణం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి చంద్రబాబు నాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.