గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (08:05 IST)

ఇలా అయితే ఎలా...? పట్టు పెంచుకోండి...! మంత్రులపై బాబు సీరియస్

ఇలా బెల్లంకొట్టిన రాళ్ళలా ఉంటే ఎలా..? మీరు మంత్రులు అది గుర్తుపెట్టుకోండి. అటు ప్రతిపక్షం వేగం పుంజుకుంటోంది. మరోవైపు బీజేపీ సహాయ నిరాకరణ చేస్తోంది. రాష్ట్రమేమో దాదాపు లోటు బడ్జెట్‌లో ఉంది. అయినా రూ. 65వేల కోట్లను వెచ్చించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. అయినా ఆశించిన స్థాయిలో ప్రచారం జరగటంలేదు. ఏం? ఎందుకు? వాటిని జనంలోకి తీసుకెళ్ళడంలో మంత్రులకు బాధ్యత లేదా..? వచ్చే సంఘటనలపై వెంటనే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు ఎందుకు ? అంటూ మంత్రులు వైఫల్యంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 
 
విజయవాడలో శుక్రవారం తొలిసారిగా జరిగిన మంత్రిమండలి సమావేశంలో మంత్రులపై ముఖ్యమంత్రి తన విశ్వరూపం చూపారు. ఒక్కొక్కరి పేరు చెప్పి మరీ సంఘటనలను ఉదహరిస్తూ తప్పుబట్టారు. నాగార్జున విశ్వవిద్యాలయం బీఆర్క్‌ విద్యార్ధిని రిషితేశ్వరి ఆత్మహత్య విషయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సమర్ధవంతంగా వ్యవహరించలేదని మండిపడ్డారట. తొలి రోజే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ను తప్పించి ఉప కులపతిని మార్చేసి ఉంటే ఇన్ని ఆరోపణలు వచ్చి ఉండేవికావని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక నుంచి విశ్వవిద్యాలయాల్లో పాలన సమర్ధవంతంగా ఉండేలా చర్యలు తీసు కోవాలని సమర్ధవంతులైన ఉపకులపతులను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం. 
 
గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసిన వైసీ సింహాద్రి ఇటువంటి సంఘటనలను ధైర్యంగా ఎదుర్కొన్నారని మంత్రి రావెల గుర్తుచేశారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందిస్తూ సింహాద్రి ప్రస్తుతం ఎక్కడు న్నారు..? వెంటనే ఆయన్ను రప్పించి ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయానికి ఉపకులపతిగా నియమించాలని ఆదేశించినట్లు సమాచారం. 
 
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పదేళ్లు ప్రతిపక్షనేతగా 40ఏళ్ల రాజకీయ జీవితంలో తాను సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నానని, తనకంటే వయసులో చిన్నవారైన మంత్రులు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించినట్లు సమాచారం. ఇక పదేపదే ఈ విషయంలో మంత్రులకు తానేమీ చెప్పనని, ఎవరి నిర్ణయం ప్రకారం వారు నేర్చుకోవాల్సిందేనని ఆయన తెగేసి చెప్పారు. 
 
మంత్రులందరూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాలని ఆయన కోరారు. మంత్రులు తమ కార్యాలయాలకు పరిమితం కాకుండా హైదరాబాద్‌, విజయవాడలో మకాంవేసి సమయం వృధా చేయకుండా అనునిత్యం ప్రజల్లో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వారు పడుతున్న కష్టాల్లో మంత్రులు సైతం భాగస్వాములుకావాలని చంద్రబాబు హితబోధ చేశారు.