గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (10:55 IST)

ప్రత్యేక హోదా ఇవ్వక పోయినా.. అందుకోసం పోరాడుతాం : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వక పోయినా ఆ హోదా కోసం పోరాడుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు ప్రకటించారు. కేంద్ర మంత్రులు ఏం చెప్పినా.. ప్రత్యేక హోదా కోసం తమ ప్రయత్నాన్ని మాత్రం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అదేసందర్భంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ కేంద్ర మంత్రి లోక్‌సభలో ప్రకటించారు. కొందరు నేతలు ఆ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ప్రకటనలో అంత స్పష్టతగానీ, సూటిగా చెప్పినట్లుగానీ లేదని వారు వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న ఇబ్బందుల దృష్ట్యా అంతకుముందు నుంచే కేంద్రం.. ప్రత్యేక హోదాపై సానుకూలంగా లేనట్లు సంకేతాలు ఇస్తోందని, అందులో భాగంగానే ఈ తాజా పరిణామం అయివుండొచ్చని మరి కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. 
 
అయితే.. వారి వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు.. కేంద్రానికి ఏ అభిప్రాయాలు ఉన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఒత్తిడి కొనసాగిస్తూనే ఉంటామని, రాజీపడేది లేదని తేల్చి చెప్పారు. ‘విభజన పరిణామాల్లో హైదరాబాద్‌ను కోల్పోయాం. ఇప్పుడు రాజధానిని కట్టుకోవాలి. ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. పరిశ్రమలు, విద్యా సంస్థలు, మౌలిక వసతులు పెంచుకోవాలన్నారు. 
 
ప్రత్యేక హోదా ఇస్తే అది కొంతవరకూ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. నేను ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ కేంద్రంలోని పెద్దలకు ఇదే వివరిస్తూ వస్తున్నాను. కొద్ది రోజుల క్రితం అనంతపురంకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి దానిపై వివరించాను. వారి ఇబ్బందులు వారికి ఉండవచ్చు. కానీ, మన ఇబ్బందులు అంతకంటే పెద్దవి చంద్రబాబు చెప్పుకొచ్చారు.