మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (12:01 IST)

చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ?: పలువురుకు ఉద్వాసన.. కొత్త ముఖాలకు చోటు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయన ఈ మంత్రివర్గాన్ని విస్తరణతో పాటు... పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుత మంత్రివర్గంలోని మంత్రుల్లో పనితీరు ఏమాత్రం మెరుగుపరుచుకోని వారికి ఉద్వాసన పలికి.. వారి స్థానంలో కొత్త వారికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, గత మంత్రివర్గంలో ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి చోటు దక్కలేదు. ఈ దఫా వారికి చోటు కల్పించాలని భావిస్తున్నారు. 
 
వాస్తవానికి చంద్రబాబు తన మంత్రివర్గంలోకి మరో ఆరుగురికి చోటు కల్పించే వెసులుబాటు ఉంది. దీంతో శాసనమండలి ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించి, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి తొలి ప్రాధాన్యతగా అవకాశం కల్పించి, మిగిలిన నాలుగు స్థానాలకు సీనియర్ నేతలను ఎంచుకునే అవకాశం ఉంది. 
 
వీరిలో ఎమ్మెల్సీగా ఖరారైన షరీఫ్‌కు మైనారిటీ కోటాలో తప్పనిసరిగా ఓ బెర్తు దక్కినట్టేనని అంచనా. మహిళా కోటాలో ఎస్టీ నేత సంధ్యారాణి పేరు కూడా వినిపిస్తోంది. పార్టీలో సీనియర్ నేతలైన కళా వెంకట్రావు, పతివాడ నారాయణస్వామి నాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, గొల్లపల్లి సూర్యారావు, ధూళిపాళ్ల నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, పయ్యావుల కేశవ్, పార్థసారథి తదితరుల పేర్లపై బాబు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరిలో పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావులకు చోటు దక్కేందుకు మెండైన అవకాశం ఉంది.