శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (11:51 IST)

రాష్ట్రపతి పీఠంపై అనాసక్తి చూపిన అబ్దుల్ కలాం.. చంద్రబాబుదే కీలక పాత్ర!

శాస్త్రవేత్తగా పనిచేసిన ఏపీజే అబ్ధుల్ కలాం అప్పట్లో రాష్ట్రపతి పీఠంపై కూర్చోమంటే అనాసక్తి చూపించలేదట. అయితే కలాంను రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టడంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడిదే కీలక పాత్రని తెలియవచ్చింది. అప్పట్లో కేంద్రం అటల్ బిహారీ వాజ్ పేయి సారథ్యంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. అప్పటికీ 8 సంవత్సరాలుగా ఏపీ సీఎం విధులు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్డీఏ కన్వీనర్‌గా వ్యవహరించారు. 
 
ఇక భారత రాష్ట్రపతిగా హిందువేతర వ్యక్తిని, ముఖ్యంగా మైనారిటీ వర్గానికి చెందిన ప్రముఖుడిని నియమించాలని ప్రధాని వాజ్ పేయి నిర్ణయించారు. ఈ మేరకు ముగ్గురు మైనారిటీ నేతల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసి, ఎన్డీఏ కన్వీర్ హోదాలో ఉన్న చంద్రబాబుకు ఫోన్ చేశారు. జాబితాలోని మూడు పేర్లలో ఒకటిగా ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం పేరుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. శాస్త్రవేత్తగా ఉన్న కలాం అందుకు ఒప్పుకుంటారా? అన్న వాజ్ పేయి ప్రశ్నకు, కలాంను ఒప్పించే బాధ్యత తనదేనని చంద్రబాబు సమాధానమిచ్చారు. 
 
వెనువెంటనే చెన్నైలో ఉన్న కలాంకు చంద్రబాబు ఫోన్ చేశారు. ‘‘రాష్ట్రపతి పదవికి మిమ్మల్ని కేంద్రం ఎంపిక చేసింది’’ అని చంద్రబాబు తెలపగా ‘‘నా పనిలో నేనున్నా, ఇవన్నీ ఎందుకు’’ అని కలాం బదులిచ్చారట. అయితే ‘‘నో’’ అని మాత్రం చెప్పవద్దని చంద్రబాబు బతిమాలి, ఎట్టకేలకు కలాంను ఒప్పించారు. ఆ తర్వాత కలాంతో మాట్లాడిన కేంద్రం, రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించిందట.