గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (15:25 IST)

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వ్యాపార కేంద్రంగా మారింది: తలసాని

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వ్యాపార కేంద్రంగా మారిందని టీఆర్ఎస్ నేత తలసాని విమర్శించారు. తెలంగాణ టీడీపీ నేతలు రూ.5 లక్షల చొప్పున చందాలు వేసుకొని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు డబ్బులు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 
 
వారంతా చంద్రబాబు ఇచ్చిన డబ్బులను పంచారన్నారు. వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. తన కొడుకును మేయర్‌గా చేసేందుకు తాను తెరాసలో చేరాననే వార్తలు అవాస్తవమని తలసాని కొట్టిపారేశారు. 
 
చంద్రబాబు తన కొడుకును దొడ్డిదారిన రాజకీయాల్లోకి తెచ్చారని, అలాంటి ఆలోచన తనకు లేదన్నారు. చంద్రబాబు తీరు నచ్చకే పార్టీని వీడానని చెప్పారు. కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు ఆయనను చంద్రబాబు తక్కువగా అంచనా వేశారని, ఇప్పుడు ఆయన ఏమిటో తెలుస్తోందన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం విడ్డూరమన్నారు.
 
పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబుపై తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు ఓ అబద్ధాలకోరు అన్నారు. ఏనాడూ మాట మీద నిలబడ్డ వ్యక్తి కాదన్నారు. రాజ్యసభ టికెట్లు ఇవ్వడంలో, ఎమ్మెల్సీ అవకాశాలు కల్పించడంలో చంద్రబాబుది అంతా వ్యాపారమే అంటూ విమర్శించారు. 
 
కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు గుంజారన్న జాబితా తన వద్ద ఉందన్నారు. సొంత పార్టీ ఎంపీని కూడా వారు వదల్లేదని ఆరోపించారు. ఈ వివరాలను సమయం వచ్చినప్పుడు బయటపెడతానని హెచ్చరించారు.