బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (15:26 IST)

రాజధాని ప్రాంతం ఇంకా గుర్తించలేదు : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఎంపిక చేసే ప్రాంతాన్ని ఇంకా గుర్తించలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగిపోయింది... ఈ విషయంలో చేయగలిగింది ఏమీ లేదు... రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేద్దామని నేతలకు సూచించారు. జాగ్రత్తగా పనిచేయకపోతే కష్టాలు తప్పవని హెచ్చరించారు. 
 
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఏకపక్ష విభజన వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. రాజధాని ఎక్కడనే విషయం కూడా ఇంకా నిర్ణయం కాలేదన్నారు. పాత అసెంబ్లీ భవనంలోకి వెళుతుంటే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుందని అన్నారు. 
 
అలాగే, రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్లను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో వాటర్ గ్రిడ్, రోడ్స్ గ్రిడ్, పవర్ గ్రిడ్, గ్యాస్ గ్రిడ్, ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ ఉంటాయని చెప్పారు. వీటి ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుందామన్నారు. పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు - చెట్టు కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వంద శాతం అక్షరాస్యతను సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. తలసరి ఆదాయం రూ.2 లక్షలకు పెరిగేలా చర్యలు తీసుకుందామని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.