గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 23 మే 2015 (18:29 IST)

కేఈకి చంద్రబాబు కౌంటర్... రాజధాని భూమిపూజకు మోడీకి ఇన్వైట్

కర్నూలుపై దృష్టిసారించలేదన్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఒక పార్టీ అధినేతగా తనకు అన్ని ప్రాంతాలను సమానమని, అన్ని ప్రాంతాలను సమానంగానే అభివృద్ధి చేస్తానని చెప్పారు. చరిత్రలో చేయనంత అభివృద్ధిని కర్నూలుకు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ జిల్లాకు విరివిగా పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు.
 
ఈ విషయాన్ని పార్టీ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. అలాగే, ఏం చేయాలో చెపితే బాగుంటుందన్నారు. అదేసమయంలో ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు తనపై అపార నమ్మకం ఉందన్నారు. పట్టిసీమపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా గోదావరి ప్రజలు నమ్మలేదన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని తప్పకుండా ఆదరిస్తామన్నారు.
 
రాష్ట్రంలో పరిస్థితిపై ప్రత్యేకంగా మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు టీవీలు, పేపర్ల ద్వారా ప్రచారం కల్పిస్తున్నామని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చిన రైతులను అభినందిస్తున్నామన్నారు.  
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని భూమి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాజధాని నిర్మాణానికి జూన్ 6 ఉదయం 8.49 నిమిషాలకు భూమి పూజ జరుగుతుందని చెప్పారు. విజయదశమి నుంచి రాజధాని పనులు ప్రారంభిస్తామని చెప్పారు.