శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (17:17 IST)

ఏపీ ఈ-కేబినెట్ భేటీ.. ఓ లుక్కేసిన నరేంద్ర మోడీ కార్యాలయం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న రీతిలో సోమవారం నిర్వహించిన ఈ-క్యాబినెట్ సమావేశం (కాగితరహిత భేటీ)పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం (పీఎంఓ) ఓ లుక్కేసింది. ఈ-కేబినెట్ సమావేశం ఎలా నిర్వహించారన్న అంశంపై ఆసక్తి చూపిన పీఎంఓ.. ఈ-కేబినెట్ నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను తమకివ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. 
 
సోమవారం చంద్రబాబు నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్ భేటీని కాగితం, పెన్ను లేకుండా సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు జరిగింది. ఈ భేటీ కోసం ఐపాడ్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లతో సమావేశం నిర్వహించారు. దాంట్లో పలు పథకాలపై చర్చించారు. ఈ భేటీకి మీడియా విశేష ప్రచారం కల్పించింది. దీంతో, ప్రధాని కార్యాలయం కూడా ఇటువైపు ఓ కన్నేసింది. ఏపీ సర్కారు జరిపిన హై-ఫై భేటీకి సంబంధించిన వివరాలు అందించాలని అధికారులను కోరింది. 
 
అంతముందు.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నాలుగు గంటలకు పైగా జరిగింది. వందరోజుల పాలన... మంత్రుల పనితీరు తదితర విషయాలపై కేబినెట్ చర్చించింది. దేశంలోనే తొలి ఈ-కేబినెట్ సమావేశంగా ఈ భేటీ చరిత్ర సృష్టించింది. తొలిసారిగా కాగిత రహిత కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ఏపీ సర్కార్ అందరినీ ఆశ్చర్యపరిచింది.