శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 9 జూన్ 2015 (10:21 IST)

హైదరాబాద్ నీ అబ్బ సొత్తా చంద్రబాబూ.. నీవు చేసిన లుచ్ఛాపని తెలిసింది.. : కేసీఆర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బహిరంగ వార్నింగ్ ఇచ్చారు. అలాగే, హైదరాబాద్ గడ్డ చంద్రబాబు తాత జాగీరు కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. నల్గొండలో జరిగిన ఒక కార్యక్రమంలో కేసీఆర్ చంద్రబాబుపై నిప్పులు కురిపించారు.
 
'నువ్వు హైదరాబాద్ ముఖ్యమంత్రివి కావు. తెలంగాణ బిడ్డ ఇక్కడ ముఖ్యమంత్రి. హైదరాబాద్‌లో నీ ఏసీబీ ఉండదు. దొంగతనం చేసి అడ్డంగా, నగ్నంగా దొరికిపోయావు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బతుకేందే, నీ రాజకీయాలు ఏమిటో, నువ్వు చేసిన లుచ్ఛా పని ఏంటో, నీ లత్కోరు పనేందో మొత్తం దేశానికి తెలిసిపోయింది. ఇవాళ తెలంగాణ ప్రజానీకం కూడా నువ్వు ఏది పడితే అది చేస్తుంటే చూడ్డానికి సిద్ధంగా లేదు. నీకు తెలంగాణ ప్రజానీకమే తగిన శాస్తి చేస్తుందంటూ గద్గగ స్వరంతో హెచ్చరించారు. 
 
జాగ్రత్త! ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నాక్కూడా ఏసీబీ ఉందంటున్నావు... మరి కేసీఆర్ నీలా దొంగ కాదు కదా? నీలా తప్పుడు పనులు మేం చేయలేదు కదా? బలం లేదని తెలిసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ పెట్టావు? గెలిచే సత్తా లేదని తెలిసీ ఎందుకు పోటీకి దిగావు? నువ్వు నీతిమంతుడివే కదా, సత్యహరిశ్చంద్రుడి ఇంటి వెనుకే నీ ఇల్లు కదా, నిజం చెప్పు! ఎందుకు పోటీకి పెట్టావు? ఎమ్మెల్యేలను కొని గెలవాలని ప్రయత్నించావు. 
 
కానీ, తెలంగాణ బిడ్డ స్టీఫెన్ సన్ నిన్ను పట్టించాడు. ఇప్పుడు నీ ఎమ్మెల్యే జైలులో ఉన్నాడు. ఈ క్రమంలో నీ ఆడియో టేపులు బయటికొచ్చాయి. దారుణం అంటూ పెడబొబ్బలు పెడుతున్నావ్. చంద్రబాబూ... నిన్నా బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు జాగ్రత్త! ఇంకా ఎక్కువ మాట్లాడితే... ఎంత శాస్తి కావాలో అంత శాస్తి చేస్తాం" అంటూ విశ్వరూపం ప్రదర్శించారు. 
 
భ్రష్టుపట్టే పని చేయడమే ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. అయినా, తమ సమస్యలు తమకున్నాయని, ఆయనను ఇరికించాల్సిన పని తమకేం ఉందన్నారు. అయినా, ఇరికించాలంటే ఇరుక్కునేంత సన్నని మనిషా చంద్రబాబు? అని అన్నారు. 
 
చంద్రబాబు ఇరుక్కునే మనిషి కాదని ఇరికించే వ్యక్తని అన్నారు. నీ కొంప ఎందుకు కూల్చుకుంటావని అన్నారు. దొంగతనం చేస్తే పట్టుకోరాదట, దొంగ అనకూడదట అని మండిపడ్డారు. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు, తెలంగాణ ఇచ్చినా ఈ దిక్కుమాలిన దందా మాకెందుకుని ప్రశ్నిస్తే... కాంగ్రెస్ సన్నాసులు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పెట్టారని కేసీఆర్ అటు కాంగ్రెస్ నేతలపై కూడా మండిపడ్డారు.