శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (08:48 IST)

రాయపూర్‌ తరహాలో సీమాంధ్రలో భూ సమీకరణ : చంద్రబాబు

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందులో భాగంగా సోమవారం చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పర్యటించారు. ఛత్తీస్‌గఢ్‌ నూతన రాజధాని నయారాయపూర్‌లో సుడిగాలి పర్యటన నిర్వహించిన చంద్రబాబు బృందం దాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విధానాలను అధ్యయనం చేసింది. 
 
ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన బాబు బృందం తిరిగి రాత్రి 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు చేరుకుంది. సోమవారం రాత్రి బేగంపేట విమానాశ్రయంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. నయారాయపూర్‌ను క్రమపద్ధతిలో అభివృద్ధి చేశారని, భూసేకరణకు అనుసరించిన విధానాలు కూడా చక్కగా ఉన్నాయని బాబు కితాబిచ్చారు. అక్కడ అనుసరించిన ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని నవ్యాంధ్ర రాజధాని విషయంలో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. 
 
నయారాయపూర్‌ నిర్మాణాన్ని పరిశీలించడంతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరేందుకు, ఆ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అధ్యయనం చేసేందుకు తాను ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించానన్నారు. ఇది సుహృద్భావ పూర్వకంగా జరిగిన పర్యటనని చంద్రబాబు పేర్కొన్నారు.
 
కాగా, చంద్రబాబు ఆధ్వర్యంలోని బృందం సోమవారం ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నయారాయపూర్‌లో పర్యటించింది. ఈ బృందంలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఆరుగురు ముఖ్య కార్యదర్శులు, పది మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వర్‌రావు, పి. నారాయణ, ఎంపీలు సీఎం రమేష్‌, గల్లా జయదేవ్‌, పారిశ్రామికవేత్తలు శ్రీని రాజు, నవయుగ విశ్వేశ్వరరావు, తదితరులు బృందంలో ఉన్నారు. తొలుత చత్తీస్‌గఢ్‌ కొత్త రాజధాని నయారాయపూర్‌ను సందర్శించిన ఈ బృందం తర్వాత ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌తో సమావేశమైంది.