శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 23 అక్టోబరు 2014 (10:40 IST)

విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దుతాం : చంద్రబాబు నాయుడు

విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదుద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తుఫాను జయిద్ధాం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘విశాఖ వాసులది ఉక్కు సంకల్పం. అందుకే పెను తుఫాన్‌ ఢీకొట్టినా పది రోజుల్లో చిరునవ్వులు పూయించాం. దీపావళికి ముందే పండగ కళ తీసుకొచ్చాం. ఇదే సహకారం అందిస్తే... విశాఖను ప్రపంచంలోనే అతి సుందర నగరంగా తీర్చిద్దుతామని ప్రకటించారు. 
 
అయితే, ఈ ఏడాదికి దీపావళికి దూరంగా ఉందామని, ఇంతకు రెండింతలు భారీగా వచ్చే సంవత్సరం నిర్వహించుకుందామని.. విశాఖ ప్రజలను కోరారు. హుదూద్‌ వంటి వంద తుఫాన్లు వచ్చినా.. తట్టుకోగల నిర్మాణాలను అందిస్తామని, సుందర నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కృషికి కేంద్రం మద్దతు తోడు కావడం వల్లనే.. తక్కువ నష్టంతో బయటపడగలిగామన్నారు. 
 
గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక తుఫాన్లు రాష్ట్రాన్ని తాకాయి. కానీ, ఆనాడు కేంద్రం ఒక్కసారి కూడా స్పందించలేదు. రాష్ట్రం ఏమైపోతున్నదనేది కనీసం పట్టించుకోలేదు. ఈసారి అలాకాదు. తుఫాను రావడానికే ముందే కేంద్రం అప్రమత్తమైంది. అటు ప్రధాని నరేంద్రమోదీ, ఇటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నాతో మాట్లాడుతూనే ఉన్నారని గుర్తు చేశారు. విశాఖపట్నం రాష్ట్రానికే ఆయువుపట్టు వంటి నగరం అని, ఈ పారిశ్రామిక నగరికి ఇలాంటి విపత్తుతో దిష్టి పోయినట్టయిందన్నారు.