శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Ivr
Last Modified: గురువారం, 5 మార్చి 2015 (19:48 IST)

రుణమాఫీకే దిక్కు లేదు... పవన్‌, అలాక్కాదన్న బాబు.... మోడికి వార్నింగా...?

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల వేళ చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు అంశాలపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల భూమిని బలవంతంగా తీసుకుంటే సహించనని తేల్చి చెప్పారు. రైతుల సమస్య తనదిగా భావించి పోరాడుతాననీ, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని వార్నింగ్ చేశారు. 
 
ఏపీ ఆర్థికంగా కిందికిపోయిన నేపధ్యంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన తరహాలో రాజధాని నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు ఒకవైపు విదేశీ టూర్లతో ప్లాన్ వేసుకుంటూ భూసేకరణ చేపట్టారు. ఈ తరుణంలో రాజధాని ప్రాంతంలోని కొందరు రైతులే భూములు ఇవ్వమని బలవంతంగా లాక్కుంటున్నారని రోడ్డుపైకి వచ్చేశారు. రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సర్కారు వేసే ప్రణాళిక లేంటి, ఎన్ని సంవత్సరాలు పడుతాయి.. రాజధాని నిర్మాణానికి ఎందుకంత స్థలం కేటాయించాల్సిన అవసరముందనే విషయంపై చంద్రబాబు ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. 

 
ఇంకా రాజధాని నిర్మాణంపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇందుకు రైతుల వ్యతిరేకత కూడా తోడైంది. దీంతో బీజేపీ-టీడీపీకి సపోర్ట్ చేసి.. ఏపీలో చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టిన పవన్ కల్యాణ్ సీన్లోకి వచ్చేశారు. రైతుల కన్నీళ్లపై రాజధాని అవసరం లేదని, వాళ్లు ఇష్టపడి భూములిస్తే తప్ప బలవంతంగా లాక్కోవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు స్పెషల్ స్టేటస్‌పై ప్రగల్భాలు పలికిన మోడీ ప్రభుత్వం చివరికి ఆర్థిక బడ్జెట్‌లో ఏమాత్రం నోరు మెదపక పోవడంపై పవన్ కల్యాణ్ మండిపోతున్నారు.
 
యూపీఏ ప్రభుత్వం నీచాతినీచంగా రాష్ట్ర విభజన చేసిందంటూ.. సీమాంధ్ర ఎంపీలను బయటికు నెట్టేసి రాష్ట్రాన్ని చీల్చేసిందని.. అలాంటి పరిస్థితి మరోసారి రానీయకుండా టీడీపీ, బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలంటూ పవన్ గుర్తు చేశారు. ఎన్నాళ్లు దేహీదేహీ అంటూ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతామంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం వంటి ఇతరత్రా అంశాలపై పవన్ కల్యాణ్- చంద్రబాబు కూర్చుని మాట్లాడుకుని.. రైతు సమస్యలకు సరైన పరిష్కారం చూపిస్తే బాగుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు. లేదంటే నవ్వుకునే పరిస్థితి ఏర్పడుతుందని.. ఏపీలో రాజధాని లేక, ఆర్థిక నిధులు లేక ప్రజల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిపోయే ఛాన్సుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
సమస్యను సామరస్యంగా పరిష్కరించి శాంతియుతంగా అన్ని వర్గాలకు మేలు చేసే దిశగా పవన్ కల్యాణ్ తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు సైతం ఆశిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజన అంటూ విసిగిపోయిన ప్రజలకు ఇంకా సమస్యల రుచి చూపించడం అంత మంచిది కాదని రాజకీయ పండితులు అంటున్నారు. కేంద్రం నుంచి రావల్సిన నిధులు తెచ్చుకోవడంలో తెలుగు ఎంపీలు ముందుండాలని.. ఇందుకోసం కావల్సిన ఉద్యమాలు, పోరాటాలు చేయాలి. 
 
అప్పుడే హక్కులను సాధించుకున్నట్లవుతుందని పవన్ చెప్పినట్లు బడ్జెట్ సమావేశాల్లోనే ప్రత్యేక హోదాపై మోడీ నోటి ద్వారా తీపి కబురు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఇకపై తెలుగు ఎంపీలు పార్లమెంటులో నోరు మెదపకపోతే మాత్రం రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిపోతుందని వారు అంటున్నారు.