బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (17:44 IST)

భవిష్యత్‌లో విద్యా హబ్‌గా తిరుపతి : సీఎం చంద్రబాబు

ఇప్పటి వరకు తిరుపతి అంటే కేవలం శ్రీవేంకటేశ్వర స్వామి మాత్రమే గుర్తుకు వచ్చేవారనీ, ఇకపై తిరుపతి అంటే విద్యా హబ్‌ కూడా గుర్తుకు వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాకలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలకు శనివారం శంకుస్థాపన జరిగింది. 
 
అనంతరం సభలో మాట్లాడుతూ నిన్నటి వరకు తిరుపతి అంటే వెంకటేశ్వరస్వామి గుర్తొచ్చేవారని, ఇప్పుడు అక్కడికి సరస్వతి ఆలయం కూడా వచ్చి చేరిందని అన్నారు. ఈ మూడు విద్యాసంస్థలు మహా విద్యాలయాలుగా మారతాయని ఉద్ఘాటించారు. భవిష్యత్తులో తిరుపతి ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుందన్నారు. మరో నాలుగేళ్లలో రాష్ట్రం ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుందన్నారు. 2029 కల్లా దేశంలో ఏపీ నెంబర్ వన్ అవుతుందని, 2050 నాటికి ప్రపంచంలోనే టాప్ కి చేరుతుందని పునరుద్ఘాటించారు.
 
ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ చూడని ఉత్సాహం కనిపిస్తోందని పేర్కొన్నారు. మనకు రాజధాని లేవు, ఏమీ లేవు అని, అన్నీ సమకూర్చుకోవాలి అని పేర్కొన్నారు. ఏపీని భవిష్యత్తులో నెంబర్ వన్‌గా మార్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకరిస్తారని, వెంకయ్యనాయుడు చొరవతో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. విభజన సందర్భంగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల పక్షాన రాజ్యసభలో పోరాడి, కొట్లాడిన వ్యక్తి వెంకయ్య నాయుడు అని కొనియాడారు.