శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (17:47 IST)

బడ్జెట్‌ను జీర్ణించుకోలేకపోతున్నా... రెక్కలు తెగనరికి ఎగరమంటున్నారు : చంద్రబాబు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ బడ్జెట్‌ను జీర్ణించుకోలేక పోతున్నట్టు చెప్పారు. పైగా.. రెక్కలు తెగ నరికి.. ఎగరమంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
ఈ బడ్జెట్‌పై ఆయన విలేకరులతో మాట్లాడుతూ అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర ఆవేదన, అసంతృప్తిని వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని... రాష్ట్ర సమస్యలను కొన్నింటినైనా తీరుస్తారని భావించామని... అయితే తమ ఆశలన్నింటినీ, అడియాశలు చేశారని అన్నారు. ఇది చాలా బాధాకరమన్నారు. బడ్జెట్‌తో తామే కాకుండా, రాష్ట్ర ప్రజలంతా తీవ్ర నిరాశ, నిస్పృహలోకి వెళ్లారని అన్నారు. ప్రజల నమ్మకాలన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. 
 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని కోరామని... అయినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అన్యాయం చేసినందుకే కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు సమాధి కట్టారని... ఇన్ డైరెక్టుగా బీజేపీకి కూడా వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర పరిస్థితిని ఎనిమిది సార్లు వివరించానని... అయినా పట్టించుకోలేదని ఆరోపించారు. 
 
ఆనాడు రాష్ట్ర విభజన జరిగే సమయంలో, బీజేపీ కూడా సహకరించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా? లేదా? ఆయన నిలదీశారు. ఎలా భాధపడాలో కూడా అర్థం కావడం లేదని అన్నారు. పోలవరంకు రూ.100 కోట్లు కేటాయించారని... అవి ఏమూలకు సరిపోతాయో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలని అడిగారు. రైతులకు తీరని అన్యాయం జరిగే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.
 
తిరుపతి బహిరంగ సభలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని వరల్డ్ క్లాస్ సిటీని నిర్మిస్తానని హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ సభలో తనతో పాటు.. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నామన్నారు. కానీ, బడ్జెట్‌లో కేటాయింపులు అరకొరగా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.