శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (14:27 IST)

చంద్రబాబు మంత్రివర్గంలో మార్పులు...? ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత..!

అలా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగియడం ఆలస్యం చంద్రబాబు మంత్రి వర్గంలో మార్పులు జరుగుతాయని రాజయకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎమ్మెల్సీలుగా ఎన్నిక కానున్న వారిలో కొందరికి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎన్నికైన కొంతమంది నేతలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. 
 
మంత్రి పదవి దక్కుతుందని అనుకుంటున్నవారిలో కళా వెంకట్రావు (శ్రీకాకుళం), పతివాడ నారాయణస్వామి (విజయనగరం), బండారు సత్యనారాయణ మూర్తి (విశాఖ), గొల్లపల్లి సూర్యారావు (తూర్పుగోదావరి), దూళిపాళ్ల నరేంద్ర (గుంటూరు), సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (నెల్లూరు), గాలి ముద్దుకృష్ణమనాయుడు (చిత్తూరు), పయ్యావుల కేశవ్ (అనంతపురం) వంటి నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే ఎమ్మెల్సీగా వున్న సంధ్యారాణి, కొత్తగా ఎన్నికకానున్న షరీఫ్‌, ప్రతిభా భారతిలు వున్నారు. ఐతే, బాబు క్యాబినెట్‌లో ముస్లింలకు, గిరిజనులకు ఇంతవరకు స్థానం దక్కలేదు. ఆ వర్గాలనూ ఈసారి సంతృప్తి పరచవచ్చనేది తెలుగు తమ్ముళ్ల లోచన. వీరికితోడు స్థానిక సంస్థల కోటా నుంచి ఎంపికయ్యే నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం ఖాయంగానే చెబుతున్నారు. 
 
ప్రస్తుతం దేవాదాయశాఖ మంత్రిగావున్న మాణిక్యాలరావు స్థానంలో సోము వీర్రాజును మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ వుందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల పవన్‌కళ్యాణ్ భూసేకరణ చట్టం పేరిట.. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తే సహించేదిలేదని హెచ్చరించిన సంగతి తెల్సిందే! ఈ నేపథ్యంలో ఆయనకు సన్నిహితుడైన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా పవన్‌ను కాస్త కూల్ చేసేందుకే ఎమ్మెల్సీ ఇచ్చినట్లు వినిపిస్తోంది.  
 
కాగా బీజేపీకి పవన్‌కళ్యాణ్‌ను దగ్గర చేయడంలోనూ, మోదీ వద్దకు పవన్‌ను తీసుకెళ్లడంలో సోము వీర్రాజు కీలకపాత్ర పోషించారు. ఈ విధంగానైనా రాజధాని భూములపై తలెత్తిన ఆందోళనను కంట్రోల్ చేయవచ్చనేది టీడీపీ ఆలోచనగా చెబుతున్నారు. అవసరమనుకుంటే వీర్రాజు చేసుకునే ప్రయత్నాలను బట్టి ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.