గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: శనివారం, 25 ఏప్రియల్ 2015 (11:03 IST)

రాజధానిలో లీజు మోసం.. ఎకరం భూమిపై 20 మందితో కౌలు ఒప్పందాలు..!

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటారు మన పెద్దలు.. అడ్డుగోలుగా డబ్బులు సంపాదించడానికి రాష్ట్ర రాజధాని అమరావతిలో కొందరు కేటుగాళ్లు రక రకాల కుయుక్తులు పన్నుతున్నారు. భూసేకరణలోని చట్టాలను, అందులోని లొసుగులను ఆసరా చేసుకుని కౌలు సొమ్ము చేసుకుంటున్నారు. రూ. 50 వేల స్థానంలో ప్రభుత్వానికి రూ. పది లక్షలు భారం పడుతోంది. చిన్న, సన్నకారు రైతులకు కలిగించిన వెసులుబాటును తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అదేలాగో చూడండి. 
 
చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు ఎకరం భూమికి కౌలు చెల్లించేలా పరిహారం ప్రకటించింది. ఏడాదికి మెట్ట భూమికి రూ.30 వేలు, జరీబు భూమికి రూ.50 వేలు కౌలు చెల్లిస్తున్నారు. ఇది అదునుగా చేసుకుని కొందరు స్థిరాస్తి వ్యాపారులు ఎకరం జరీబు భూమి కొనుగోలు చేసి వారి బంధువులు, స్నేహితుల పేరుతో 20 మందికి రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. 
 
వారిలో కొంత మంది కేటుగాళ్లు 5 సెంట్లు చొప్పున ప్రభుత్వానికి ఒప్పంద పత్రాలు ఇచ్చే ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఏడాదికి కౌలు చెల్లించాలి. ఈ లెక్కన తొలి ఏడాదిలోనే రూ.10 లక్షలు ఎకరం భూమికి కౌలు రూపంలో ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. అంటే భూమి ఎకరమే.. కానీ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చేది రూ. 20 లక్షలు ఎక్కడో తేడా ఉందని గమనించిన అధికారలు దీనిపై దృష్టి సారించారు. 
 
రాజధానికి భూ సమీకరణ చేసిన 29 గ్రామాల్లో సీఆర్‌డీఏకు భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం కౌలు చెల్లిస్తోంది. రెవెన్యూ 1బీ రికార్డు ప్రకారం 50 సెంట్లలోపు భూమి ఉన్న రైతులు 3,995 మంది, 50 సెంట్ల నుంచి ఎకరం వరకు భూమి ఉన్న యజమానులు 5,244 మంది ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎకరం భూమిని పలువురికి కౌలుకు ఇచ్చినట్లు పత్రాలు రావడంతో ప్రభుత్వం అత్యధిక సొమ్మును చెల్లించాల్సి వచ్చింది. ఇది గమనించిన అధికారులు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందనే విషయాన్ని గ్రహించారు. దీంతో వారికి చెక్ పెట్టే నిర్ణయం తీసుకున్నారు.