గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (12:28 IST)

రాయపాటి కాంట్రాక్టు పనులకు చెక్..? అధికార పార్టీ ఆ మాత్రం నిలుపుకోలేరా..?

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీ ఏదైనా.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తన పనులు చక్కబెట్టుకోవడం దిట్ట అనే పేరుంది. అయితే ఆయన చేస్తున్న కాంట్రాక్టు పనులకే ప్రస్తుతం చెక్ పడుతోంది. దాదాపుగా రూ. 300 కోట్ల రోడ్డు పనులను నిలిపేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఏం ఎందుకు? 
 
రాజమండ్రి నుంచి కాకినాడ వరకు రోడ్డు విస్తరణ కాంట్రాక్టును సంపాదించుకున్న ఆయన కంపెనీ- ట్రాన్స్ ట్రాయ్ సంస్థ చేపట్టిన  పనుల్ని నిర్దేశించిన సమయానికి పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం తన పని తాను చేసుకుపోయే పనిలో పడింది. దాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో కూడిన ఈ కాంట్రాక్టు పనులు రెండు శాతం మాత్రమే  జరిగాయని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శ్యాంబాబు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించినట్టు సమాచారం. రాష్ట్రాన్ని శరవేగంతో ముందుకు నడిపించాలనుకుంటున్న సి.ఎం. చంద్రబాబుకు దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. 
 
వ్యక్తి పర్యటనపై విదేశాలలో ఉన్న చంద్రబాబు తిరిగి వచ్చిన తరువాత దీనిపై నిర్ణయం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. గతంలో రాజీవ్ గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా పేరు పడిన రాయపాటి రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దక్కించుకున్న కాంట్రాక్టును తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా ఇబ్బందులు లేకుండా  నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన నేరుగానే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనూ ఆయన తన పలుకుబడితో చక్రం తిప్పుతారంటూ కొంతమంది చెబుతున్నారు.