శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (16:49 IST)

రామోజీ - పరకాలకు చెవిరెడ్డి నోటీసులు ఎందుకు పంపారంటే?

తన పరువుకు భంగం కలిగించేలా అసత్య అరోపణలు చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌కు, తన వివరణ తీసుకోకుండానే దురుద్దేశంతో ఆ ఆరోపణలను ఈనాడు పత్రికలో వార్తగా ప్రచురించారని ఈనాడు సంస్థల అధిపతి రామోజీ రావుకు వైకాపా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి మంగళవారం లీగల్ నోటీసులు పంపించారు. 
 
తన పరువుకు భంగం కలిగించేలా ప్రభాకర్ మాట్లాడితే, కనీసం తన వివరణ తీసుకోకుండానే ఆ వ్యాఖ్యలను ఈనాడులో ప్రచురించారని నోటీసులో పేర్కొన్నారు. నోటీసు అందిన 15 రోజుల్లోపు నష్టపరిహారంగా రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చెవిరెడ్డి తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డికి పింఛన్ వస్తుందని, ఆ పింఛను ఎవరు తీసుకుంటున్నారో చెప్పాలని చెవిరెడ్డి తండ్రికి పింఛను ఇవ్వాలా, దీని పైన జగన్ సమాధానం చెప్పాలని పత్రికా సమావేశంలో పరకాల ప్రభాకర్ ఇటీవల సవాల్ విసిరిన విషయం తెల్సిందే. 
 
దీనిపై చెవిరెడ్డి నోటీసు పంపించారు. చెవిరెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి దరఖాస్తు చేయకున్నా అర్హుల జాబితాలోకి ఆయన పేరు ఎలా వచ్చిందో చెప్పాలంటూ అధికారులను చెవిరెడ్డి రాతపూర్వకంగా కోరారు. అధికారుల పొరపాటు వల్లే పింఛను జాబితాలోకి మీ తండ్రి పేరు చేరిందని, అందులో మీ ప్రమేయం లేదని, ఏ రోజు పింఛను డబ్బు తీసుకోలేదని అధికారులు చెవిరెడ్డికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీని ఆధారంగా చేసుకుని వారిద్దరికి చెవిరెడ్డి లీగల్ నోటీసులు పంపించింది.