శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 18 జులై 2018 (20:14 IST)

చిరంజీవిని రాజకీయాల్లోకి రావద్దంటున్న ఆ ప్రాంత ప్రజలు.. ఎందుకంటే?

మెగాస్టార్‌ను జనసేనలోకి పవర్‌స్టార్ ఆహ్వానించారా? తమ్ముడు పిలిచిన వెంటనే పార్టీలోకి వెళ్ళేందుకు అన్న సిద్ధమైపోయారా. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్న చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ప్రజలు స్వాగతిస్తారా... అసలు చిరంజీవికి తిరిగి రాజకీయ

మెగాస్టార్‌ను జనసేనలోకి పవర్‌స్టార్ ఆహ్వానించారా? తమ్ముడు పిలిచిన వెంటనే పార్టీలోకి వెళ్ళేందుకు అన్న సిద్ధమైపోయారా. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్న చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ప్రజలు స్వాగతిస్తారా... అసలు చిరంజీవికి తిరిగి రాజకీయ పార్టీలో చేరాలన్న ఆలోచన ఉందా? 
 
మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినీపరిశ్రమలో అగ్ర హీరోగా వెలుగొందిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేసిన చిరంజీవి కేవలం 18 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకోగలిగారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో నిలబడిన చిరంజీవి స్వల్ప మెజారిటీతోనే గెలిచారు. కొన్ని నెలల పాటు పార్టీని నడిపిన చిరంజీవి ఆ తరువాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. అంతటితో ఆగలేదు... తను గెలుపొందిన తిరుపతి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభ నామినేటెడ్ పదవిని స్వీకరించాడు. అలాగే కేంద్రమంత్రిగా కూడా పనిచేశాడు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. 
 
అయితే కొన్నిరోజుల పాటు పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన చిరంజీవి తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోయారు. ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించి ఆ తరువాత ప్రస్తుతం సైరా సినిమాలో నటిస్తున్నారు. సైరా సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవిని పవన్ కళ్యాణ్‌ కలిసి జనసేనలోకి రమ్మని ఆహ్వానించినట్లు ప్రసార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ఏకంగా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు స్వామినాయుడు కూడా జనసేన పార్టీలోకి వెళ్ళిపోవడంతో ప్రజలందరూ చిరు జనసేనలోకి వెళ్ళడం ఖాయమనుకున్నారు.
 
కానీ చిరంజీవి మాత్రం ఇప్పటివరకు తను రాజకీయాల్లోకి తిరిగి వస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. తమ్ముడు పవన్ కళ్యాణ్‌ కూడా ఆ విషయాన్ని ధృవీకరించలేదు. అయితే చిరంజీవి జనసేనలోకి పార్టీ వస్తారన్న వార్తపై తిరుపతి ప్రజలు మండిపడుతున్నారు. చిరంజీవిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమను మోసం చేసి ఆ పదవికి రాజీనామా చేశారని విమర్శిస్తున్నారు. చిరంజీవి రాజకీయ నాయకుడిగా కంటే సమాజ సేవలు చేసుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.