మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2017 (14:51 IST)

నాది, పవన్‌‍ది ఒకటే ఆలోచనే.. పోలవరం విషయంలో రాజీపడను: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ఏపీ సర్కారు తగిన చర్యలు తీసుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా అదే ఆలోచనలో వున్నారు. ఎలాగైనా పోలవరాన్ని పూర్తి చేయాలనే ఉద

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ఏపీ సర్కారు తగిన చర్యలు తీసుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా అదే ఆలోచనలో వున్నారు. ఎలాగైనా పోలవరాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో తమపై ఒత్తిడి తెస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సాయపడుతుందని హామీ ఇచ్చింది. 
 
కానీ ఇంతలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వెళ్లి అభ్యంతరాలు తెలిపింది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఈ ప్రాజెక్టుకు అడ్డు తగిలారు. పోలవరం విషయంలో కాంగ్రెస్, వైసీపీ నాటకాలు ఆడకపోతే ఆ ప్రాజెక్టుకు అడ్డంకులు వచ్చేవి కావని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గతంలో పట్టిసీమను ఆపాలనుకున్నారు. కానీ కుదరలేదు. అలాగే ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. 
 
మూడురోజుల దక్షిణకొరియా పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి చంద్ర‌బాబు విజయవాడ చేరుకున్నారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ ఉద్దేశం పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తేవడమేనన్నారు. తనపై బురద చల్లడం కోసమే వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తుందన్నారు. కానీ పోల‌వ‌రం ప్రాజెక్టును పవన్ పూర్తి చేయాలనే ఆలోచనలో వున్నారని బాబు వ్యాఖ్యానించారు. 
 
ప్రస్తుతానికి పవన్ డిమాండ్ చేసినట్లు అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీకి పోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు వెల్లడించారు. అఖిలపక్షం చేసే పనికంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనే ఎక్కువుందని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టులో జాప్యం జరిగితే ఖర్చు భారీగా పెరుగుతుందని.. అందుకే వేగంగా పనులు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
 
ప్రభుత్వం ఎవ్వరికీ వ్యతిరేకం కాదని, పోలవరం పూర్తి కావడమే ప్రధానమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లేఖలు రాశారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఇక తాము చేసింది కూడా వుందనేందుకు కొందరు పాదయాత్రలు చేస్తున్నారని.. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు దెప్పిపొడిచారు.