గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (15:09 IST)

ఆస్తులను ప్రకటించిన సీఎం చంద్రబాబు: కోడలు బ్రహ్మణి ఆస్తులు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తన ఆస్తులను, తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించారు. గత ఏడాదితో పోల్చుకుంటే తనతో పాటు భార్య, కుమారుడి ఆస్తుల్లో పెద్దగా మార్పుల్లేవని, కోడలు బ్రహ్మణి ఆస్తులు పెరిగాయని చెప్పారు. 
 
వరుసగా నాలుగో ఏడాది ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నానని, వచ్చే ఏడాది నుంచీ తన కుమారుడు, కోడలు వారి ఆస్తులను స్వయంగా వెల్లడిస్తారని చెప్పారు. శుక్రవారం రాత్రి చంద్రబాబు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్తుల వివరాలు తెలియజేయడంతో పాటు ఇతర అంశాలపై మాట్లాడారు..
 
‘‘నా భార్య ఆస్తులు అన్నీ యధాతథంగా ఉన్నాయి. పీఎఫ్ మాత్రం రూ.1.08 కోట్లు పెరిగింది. బంగారం పెరిగింది. నికర ఆస్తులు తగ్గాయి. కుమారుడు లోకేష్ ఆస్తులు కూడా యధాతథంగా ఉన్నాయి. పీఎఫ్‌లో రూ.34 లక్షలు పెరిగాయి.
 
వాహనాల సంఖ్య ఒకటి మేరకు పెరిగింది. నికర ఆస్తుల విలువ రూ.1.40 కోట్లు తగ్గింది. బ్రహ్మణి నికర ఆస్తి పెరిగింది. నిర్వాణ హోల్డింగ్స్ ఆస్తులు పెద్దగా పెరగలేదు. గతంలో రెండున్నర కోట్ల నష్టాల్లో ఉంటే ఈసారి రూ.90 లక్షల లాభాల్లోకి వచ్చింది. హెరిటేజ్ కంపెనీ టర్నోవర్ ఏడాదికి రూ.1,722 కోట్లు ఉంది. 22 సంవత్సరాల క్రితం నేను ప్రమోటర్‌గా ప్రారంభించిన కంపెనీ ఇప్పుడు ఇంత పెద్దస్థాయిలో ఉండటం గర్వంగా ఉంది. 
 
నా భార్య భువనేశ్వరితో పాటు మిగిలిన బృందం సమర్ధ నిర్వహణ వల్లే పలు అవార్డులు సాధించింది. మెంటర్‌గా దీనికి సంతోష పడుతున్నాను. కంపెనీ కోసం ములుగులో సోలార్  విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాం. క్రమశిక్షణ, నిబద్దత కోసమే ఆస్తులు ప్రకటిస్తున్నాను. ప్రతి రాజకీయ నేత ఆస్తులు ప్రకటించాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.