శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 మే 2016 (09:00 IST)

ముక్తీశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న కేసీఆర్ దంపతులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీలు చిక్కినపుడు ఒక్కో మొక్కును చెల్లించుకుంటున్నారు. ఆయన సోమవారం కరీంనగర్ జిల్లాలోని మహదేవ్ పూర్ మండలంలోనిపవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి ఉన్న మొక్కును చెల్లించుకున్నారు. 
 
ఇందుకోసం సోమవారం ఉదయాన్ని ఆలయానికి చేరుకున్న కేసీఆర్ దంపతులు తొలుత ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం తన మొక్కులు చెల్లించుకున్నారు. సీఎంకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 
 
తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే కిలోన్నర బంగారంతో కాళేశ్వరం సన్నిధిలోని శుభానందా దేవికి స్వర్ణ కిరీటాన్ని సమర్పిస్తానని 2012లో మొక్కిన కేసీఆర్, స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కాళేశ్వర క్షేత్రానికి సోమవారం వచ్చి ఆ మొక్కును చెల్లించుకున్నారు. కేసీఆర్ దంపతులు రూ.60 లక్షలతో చేయించిన బంగారు కిరీటాన్ని స్వామి వారికి సమర్పించారు. ఈ కిరీటాన్ని హైదరాబాద్ అబిడ్స్‌లోని త్రిభువన్ జ్యువెలరీస్ తయారు చేసింది. 
 
ఆ తర్వాత కన్నెపల్లి వద్ద కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా పంప్ హౌజ్‌కు కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.