శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (16:49 IST)

కేసీఆర్ రవాణా మంత్రిగా ఉన్నపుడు ఆర్టీసీ లాభాల్లో ఉన్నది... విలీనం ప్రసక్తే లేదు

రవాణా శాఖామంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆర్టీసీ లాభాల్లో ఉన్నదని తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సమ్మెపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సమావేశం అనంతరం రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో తెరాస ఈ విషయం చెప్పలేదని గుర్తుచేశారు. ఆర్టీసీ సమ్మెను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. 
 
ప్రజా రవాణా వ్యవస్థ కుంటుపడకుండా 7,358 ప్రైవేట్ వాహనాలను నడుపుతున్నట్టు చెప్పారు. తాము చర్చలకు సానుకూలంగా ఉన్నా, కార్మిక సంఘాల నేతలే చర్చల నుంచి వైదొలగి వెళ్లిపోయారని పువ్వాడ ఆరోపించారు. తమపై విపక్షాలు చేస్తున్న విమర్శల్లో పసలేదన్నారు. 
 
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అంటూ ప్రశ్నించారు. కమ్యూనిస్టులు పాలిస్తున్న కేరళలో ఆర్టీసీని ఎందుకు విలీనం చేయలేదని అన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, 2018లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో ఓసారి ప్రతిపక్షాలు గుర్తెరగాలని హితవు పలికారు. కర్రు కాల్చి వాతపెట్టినా ప్రతిపక్ష నేతలకు సిగ్గ రాలేదని మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు.