శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 20 జులై 2014 (16:54 IST)

ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం సలహా కమిటీ ఏర్పాటు!

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణంలో తీసుకోవాల్సిన పలు అంశాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ కన్వీనర్‌గా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. 
 
కమిటీలో ఎంపీలు సుజనా చౌదరి, గల్లా జయదేవ్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ రావు, పారిశ్రామికవేత్తలు సంజయ్ రెడ్డి (జీవీకే), బొమ్మిడాల శ్రీనివాస్ (జీఎంఆర్), ఎం. ప్రభాకర్ రావు (నూజివీడు సీడ్స్), పీపుల్స్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధి శ్రీనివాసరాజు సభ్యులుగా ఉంటారు. 
 
రాజధాని నిర్మాణంలో భాగంగా అసెంబ్లీ, సచివాలయం, ఇతర ముఖ్య నిర్మాణాలను ఎక్కడెక్కడ, ఏ రీతిన నిర్మించాలన్న ఆరు అంశాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వానికి కమిటీ సలహాలు ఇస్తుందని సర్కారు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత సభ్యులకు అదనంగా మరో ముగ్గురు జాతీయ, అంతర్జాతీయ నిపుణులను కూడా కమిటీలో చేర్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.