బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (10:28 IST)

'శాంతి వారధి' చంద్రన్న ఇకలేరు...

మావోయిస్టు - జనశక్తి నేతలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన శాంతి చర్చల్లో మధ్యవర్తిగా (శాంతిదూత)గా వ్యవహరించిన కామ్రేడ్ చంద్రన్న కన్నుమూశారు. ఈయన కార్మిక వర్గ పోరాటాలు జరిపి కార్మిక హక్కులను కాపాడిన నేత అంటూ ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. 
 
ఈసీఐఎల్, బీహెచ్‌ఈఎల్ కార్మిక హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన పోరాట పతాక కా: చంద్రన్న. కార్మిక ఉద్యమాలలో అనేక పోలీసు నిర్బంధాలు, జైలు జీవితం అనుభవించిన ధీశాలిగా గుర్తింపు పొందారు. 
 
హైదరాబాద్ నగరంలో గుడిసె వాసుల సంఘాలు ఏర్పాటు చేసి అనేక బస్తీలు నిర్మించిన ఘనత ఆయనకే దక్కింది. బీడీ కార్మిక సంఘాన్ని బలోపేతం చేసి వారికి అండగా నిలిచారు. అంబేడ్కర్ యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు దారి చూపిన బాటసారి. 
 
అనేక సందర్భాలలో బూర్జువా పార్టీలు తమ పార్టీలకు ఆహ్వానించి, పదవులు ఇస్తామని ఆశ చూపినప్పటికీ వేటిని లెక్క చేయకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీని అంటిపెట్టుకొని విప్లవ జెండా ఎత్తిపట్టిన విప్లవ వీరుడు. పట్టుదల, కార్యదీక్షత, అలుపెరుగని విప్లవ పోరాటపటిమ ఈనాటి విప్లవ తరానికి ఆదర్శం. 
 
ఇప్పుడున్న పరిస్థితులలో కామ్రేడ్ చంద్రన్న మరణం విప్లవోద్యమానికి చాలా పెద్ద లోటు. అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన కామ్రేడ్ చంద్రన్నకు విప్లవ జోహార్లు. అమర్ హై శాంతి చర్చల ప్రతినిధి కామ్రేడ్ చంద్రన్న.