గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (18:12 IST)

ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న చౌదరి.. ప్యాకేజీ + స్టేటస్ కావాలన్న శీలం!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని, తాము అధికారంలోకి వస్తే పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో బీజేపీ నేత ఇప్పట్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రగల్భాలు పలికారని జేడీ శీలం ఎద్దేవా చేశారు. అయితే ఆ హామీని ఎన్డీయే సర్కారు విస్మరించిందని.. దీనిపై బీజేపీ సర్కారు సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఏపీకి పేర్కొన్న ప్రత్యేక హైకోర్టు, ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, స్పెషల్ స్టేటస్ వంటి ఇతరత్రా అంశాలను నెరవేర్చాలని జేడీ శీలం డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఆలోచన ఉంటే చట్టంలో ఎలాంటి నిబంధనా అడ్డురాదన్నారు. 2018లోపు పోలవరాన్ని పూర్తి చేసేందుకు కేంద్రం సత్వరమే నిధులు అందించాలని జేడీ శీలం ప్రభుత్వాన్ని కోరారు. 
 
ఇదిలా ఉంటే.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నందున ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి హెచ్‌పీ చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ.. 14వ ఆర్థిక సంఘం చెప్పినట్లు ప్రత్యేక హోదా అవసరం లేదని, హామీల్ని అమలుచేస్తున్న తరుణంలో ప్రత్యేక హోదా ఎందుకని ప్రశ్నించారు.