గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 2 జులై 2015 (12:45 IST)

తెలంగాణలో కుదేలవుతున్న కాంగ్రెస్...! టీఆర్ఎస్‌కు నాయ‌కుల క్యూ...!?

  • జాబితాలో దానం, నందీశ్వర్‌గౌడ్‌, మాజీ ఎంపీ విఠల్‌రావు, 
  • జానాకు టీఆర్ఎస్ గాలం 
 
కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌ నేతలు ఒక్కక్కరుగా పార్టీని వీడుతున్నారు. పార్టీకి అండ‌దండ‌గా ఉంటార‌నుకున్న నాయ‌కులు వ‌ల‌స‌బాట ప‌డుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ ‘ఆకర్ష్‌’కు కాంగ్రెస్ పార్టీ కుదేలైపోతోంది.  తాజాగా, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌లో చేరిక అంశం పార్టీని మరింత అత‌లాకుత‌లం చేస్తోంది. డీఎస్‌తో పాటే మరికొంతమంది నేతలు కాంగ్రెస్‌ను వీడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు కాంగ్రెస్ సీనియ‌ర్లు కేసీఆర్‌కు ట‌చ్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. 
 
గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌ కూడా టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దానం, డీఎస్‌ మధ్య సత్సంబంధాలున్నాయి. డీఎస్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనందున... తాను గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు దానం ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా వీరిద్దరిదీ ఒకే సామాజిక వర్గం. పార్టీలో బీసీలను అణగదొక్కుతున్నారన్న అభిప్రాయం వీరిలో ఉంది.  బీసీలకు స్థానం లేనప్పుడు పార్టీలో ఉండి ప్రయోజనమేమిటన్న భావనతో దానం కూడా డీఎస్‌ వెంటే టీఆర్‌ఎస్‌లో చేరవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. 
 
మెదక్‌ జిల్లాలో మరో కీలక బీసీ నేత నందీశ్వర్‌గౌడ్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతారని తెలుస్తోంది. నిజామాబాద్‌ జిల్లాకే చెందిన మాజీ మంత్రి పి.సుదర్శన్‌ రెడ్డి కూడా డీఎస్‌తోపాటు టీఆర్‌ఎస్‌ తీర్థంపుచ్చుకోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక మాజీ ఎంపీ, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత విఠల్‌రావు బుధవారం సీఎంను కలిశారు. జిల్లా సమస్యలపై కలిసినట్లు చెబుతున్నప్పటికీ,  టీఆర్‌ఎస్‌లో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తే, తనకు టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. కానీ సీఎం నుంచి ఎలాంటి భరోసా లభించలేదని తెలుస్తోంది. 
 
ఇక పార్టీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి సీఎంను కలిసినట్లు, టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు బుధవారం టీవీ చానెళ్లలో స్ర్కోలింగ్‌లు ప్రసారమయ్యాయి. అయితే తాను పార్టీని వీడేది లేదంటూ ఆయన మీడియాకు చెప్పారు. ఏమైనా రంగారెడ్డిపై కూడా సందేహాలున్నాయంటూ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ కూడా ఇటీవల పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈయన కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరుతారన్న వార్తలు పార్టీలో వినిపిస్తున్నాయి. కానీ తాను పార్టీ మారేది లేదని ముఖేశ్‌ స్పష్టం చేయడం విశేషం. ఇలా సీనియర్‌ నేతలంతా పార్టీని వీడడానికి సిద్ధమవుతుండడం.. మిగిలినవారిలో ఆందోళన కలిగిస్తోంది.