బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (14:38 IST)

అంధులను గొడ్డులా బాదేసిన కరస్పాండెంట్ అరెస్టు

అంధులని కూడా చూడకుండా ముగ్గురు పిల్లలను అంధుల పాఠశాల కరస్పాండెంట్ బెత్తం పట్టుకుని గొడ్డును బాదినట్టు చితకబాదాడు. అది కూడా ఏదో తప్పు చేసిన వాళ్లను దండించినట్లు కాకుండా.. ఆ పిల్లలతో తనకు జన్మజన్మల విరోధం ఉన్నట్లుగా కొట్టాడు. ఆ దెబ్బలను తట్టుకోలేక కాళ్లావేళ్లా పడిన ఆ కరస్పాండెంట్ ఏమాత్రం కనికరించలేదు. ఇంత చేసిన సదరు కరస్పాండెంట్ కూడా అంధుడే కావడం గమనార్హం. ఈ దారుణ సంఘటన కాకినాడలోని గ్రీన్ఫీల్డ్స్ అంధుల పాఠశాలలో జరిగింది. 
 
స్వయంగా తాను కూడా అంధుడే అయిన పాఠశాల కరస్పాండెంట్, పిల్లలు అల్లరి చేశాడని ముగ్గురిని పట్టుకుని పేకబెత్తంతో వీపుమీద ఎడాపెడా బాదేశాడు. వద్దు వద్దని కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నా ఏమాత్రం కనికరించలేదు. కళ్లు కనిపించక ఓ పిల్లాడు వేరేవైపు తిరిగి ఉంటే, 'ఒరేయ్ అటు కాదురా.. నేను ఇక్కడున్నాను ఇటు తిరుగు' అంటూ తనవైపు తిప్పుకొని మళ్లీ మళ్లీ బెత్తంతో వీపుమీద ఎడాపెడా బాదేశాడు. ఆయనకు మరో వ్యక్తి కూడా దగ్గరుండి సహకరించాడు. 
 
ఇదే అంశంపై డీఈవో శ్రీనివాసుల రెడ్డి స్పందించి.. పాఠశాలకు మండల విద్యాశాఖాధికారిని పంపి విచారణ జరిపారు. ఆ తర్వాత వారిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సంఘటనపై బాలల హక్కుల కమిషన్కు చెందిన అచ్యుతరావు కూడా స్పందించారు. అసలు పిల్లల ఒంటిమీద చెయ్యి కూడా వెయ్యకూడదని, అలాంటిది అంధుడని కూడా చూడకుండా చిన్నారి ఒంటిమీద వాతలు తేలేలా అంతలా కొట్టడం అత్యంత హేయమైన ఘటన అని మండిపడ్డారు.