శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 1 జులై 2015 (12:49 IST)

రూ. 30 లక్షల పచ్చ నోట్లు... కళ్ళముందే కాలి బూడిదయ్యాయి.

పచ్చని కరెన్సీ నోట్లు... కొన్ని కొత్తవి.. అందరూ చూస్తుండగా కాలి బూడిదయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు రూ. 30 లక్షల విలువ చేసే నోట్లు దగ్ధమైపోయాయి. కనీసం వాటిని బయటకు తీసే సాహసం కూడా చేయలేని స్థితిలో చుట్టుపక్కల వారు నిశ్చేష్టులై ఉండిపోయారు. ఈ సంఘటన మంగళవారం నాటి ఆంధ్రాబ్యాంకు అగ్నిప్రమాదంలో సంభవించింది. వివరాలిలా ఉన్నాయి.
 
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఆంధ్రాబ్యాంకు మెయిన్ బ్రాంచిలో మంగళవారంనాడు అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 10 కంప్యూటర్లు, ఫర్నిచర్, ఫైళ్లు బూడిదయ్యాయి. అదే సమయంలో బ్యాంకులోని కరెన్సీ కూడా కొంత కాలి బూడిదయ్యింది. రూ. 1000, రూ.500 నోట్లు ఎక్కువగా, రూ. 100 నోట్లు కూడా అగ్నిప్రమాదంలో బూడిదయ్యాయి. కళ్లముందే నోట్లు కాలి బూడిదవుతుంటే చూస్తూ ఊరుకోవడం తప్ప సిబ్బంది ఏమి చేయలేని స్థితి నెలకొంది. 
 
చివరకు అగ్నిమాపక సిబ్బంది భవనం గోడ పగులగొట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. సాయంత్రం బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు, అర్బన్ సీఐ స్ట్రాంగ్ రూమ్‌లోకివెళ్లి పరిశీలించారు. లాకర్లు భద్రంగానే ఉన్నాయని ఖాతాదారులకు ఎటువంటి నష్టంలేదని ప్రకటించారు.