మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2017 (11:39 IST)

నాడు ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం సబబే.. బయోపిక్‌లో వైస్రాయ్ ఘటన ఉండాలి: పురంధేశ్వరి

బీజేపీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, సినీ నటుడు అయిన ఎన్టీఆర్.. తెలుగు ప్రజల్లో చిరస్మరణీయుడిగా నిలిచారు. ఎన్టీఆర్ గ

బీజేపీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, సినీ నటుడు అయిన ఎన్టీఆర్.. తెలుగు ప్రజల్లో చిరస్మరణీయుడిగా నిలిచారు. ఎన్టీఆర్ గురించి ఆయన కుమార్తె పురంధేశ్వరి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో విబేధాలు, ప్రత్యేక హోదా, బీజేపీ, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, ఎన్టీఆర్ జీవితంపై సినిమా, భువనేశ్వరితో సంబంధాలు, జనసేనతో పొత్తు వంటి ఇతరత్రా అంశాలపై ఆమె స్పందించారు. 
 
ఈ క్రమంలో ఒంటరి జీవితంలో తోడు కావాలని కోరుకున్న ఎన్టీఆర్, నాడు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయమేనని పురంధేశ్వరి తెలిపారు. కానీ ఎన్టీఆర్‌ను చివరి దశలో ఆయన పిల్లలెవ్వరూ పట్టించుకోలేదనే విషయంలో నిజం లేదన్నారు. నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా నేడు నడవట్లేదని విమర్శించారు. 
 
రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన వారసులు కారని.. ఎవరైతే వారి ఆదర్శాలను కొనసాగిస్తారో వారే నిజమైన వారసులని.. తమ్ముడు బాలయ్య అప్పట్లో చెప్పాడని పురంధేశ్వరి గుర్తు చేసుకున్నారు. 2004లో తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని, విధిలేని పరిస్థితుల్లో పోటీకి దిగాల్సి వచ్చిందని తెలిపారు. కొత్త పార్టీ పెట్టడం అంత సులభం కాదని, తనకు ఆ స్థాయి లేదని చెప్పారు.
 
తాను పార్టీ మారనని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. తమ తండ్రి ఎన్టీఆర్‌కు సంబంధించిన అన్ని విషయాలు తన సోదరుడు బాలకృష్ణకు తెలుసునని పురంధేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ విషయంలో కథకు సంబంధించి చర్చలకు రమ్మని పిలిస్తే వెళతాను. చరిత్రను ఎవరూ వక్రీకరించలేరు. ఎన్టీఆర్‌పై తీసే సినిమాలో కచ్చితంగా వైస్రాయ్ హోటల్ సంఘటన ఉండాలి’ అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.
 
నారా లోకేష్ మంత్రి పదవి ప్రమాణస్వీకారంపై మాట్లాడుతూ.. తమను ఆహ్వానిస్తే వెళ్లేవాళ్లమని, పిలవని పేరంటానికి వెళితే బాగుండదని వెళ్లలేదన్నారు అయితే, లోకేష్‌కు తమ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుతో శత్రుత్వం లేదని, భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. తెలంగాణలో జరిగిన పార్టీ ఫిరాయింపులపై నాడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. 
 
ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే ఏపీలో జరిగిన ఫిరాయింపులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశానని తెలిపారు. తాను రాసిన లేఖపై విమర్శలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం గొప్ప విషయమని, మోదీ మూడేళ్ల పాలనకు పదికి తొమ్మిదిన్నర మార్కులు వేస్తున్నానని పురంధేశ్వరి తెలిపారు.