శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (11:43 IST)

దాసరి ఆస్తుల జప్తు.. బొబ్బిలి పులి కాదు.. బొగ్గుల పులి!

దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) జప్తు చేసింది. దాసరి నారాయణరావుకి చెందిన సౌభాగ్య మీడియా లిమిటెడ్‌కి చెందిన 2.25 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. కేంద్ర బొగ్గు శాఖ సహాయమంత్రిగా వున్న సమయంలో దాసరి నారాయణరావు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వున్న విషయం తెలిసిందే. 
 
అమర్‌కొండా ముర్గాదంగల్‌ బొగ్గు గనిని కేటాయించినందుకు ప్రతిఫలంగా జిందాల్‌ గ్రూప్‌కి చెందిన జెఎస్‌డబ్ల్యు నుంచి సౌభాగ్య మీడియాకు నిధులు ముట్టినట్టుగా ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై ఇడి అధికారులు మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద దాసరిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు గతంలోనే దాసరిని ప్రశ్నించారు. తాజాగా అధికారులు జప్తు చేసిన ఆస్తుల్లో 50 లక్షల రూపాయల నగదు, రెండు లగ్జరీ వాహనాలు, ఇల్లు ఉన్నట్టు తెలిసింది. అయితే సౌభాగ్య మీడియాలో తాను 2008-2011 మధ్య కాలంలో మాత్రమే డైరెక్టర్‌గా ఉన్నట్టు దాసరి చెబుతున్నారు. 
 
దీంతో ఈ స్కామ్‌లో తవ్విన కొద్దీ... ఆయన వంటి నిండా మసే కనిపిస్తోంది. దాసరి నారాయణ... ఒకప్పుడు బొబ్బిలి పులి. కానీ ఇప్పుడో మసంటుకున్న బొగ్గుల మేస్త్రీగా మారిపోయారు. కోల్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి. 2004 నుంచి 2008 వరకూ కేంద్ర బొగ్గుగనుల శాఖలో సహాయ మంత్రిగా పనిచేసిన ఆయన కోల్‌ స్కాంలో ఇరుక్కున్నారు. బొగ్గు కుంభకోణంలో దాసరి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ తేల్చేసింది. జిందాల్‌ కంపెనీ నుంచి క్విడ్‌ ప్రోకో రూపంలో తన కంపెనీలో పెట్టుబడులు పెట్టించినట్లు గుర్తించింది. ఇదే విషయాన్ని గతంలో బొగ్గుగనుల శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌ ఓ పుస్తకం రాసి మరీ ధ్రువీకరించారు. దీంతో ఇప్పటికే పలుమార్లు నారాయణరావును సీబీఐ విచారించింది.
 
అయితే, దాసరి వాదన ఇంకోలా ఉంది. అటాచ్ అయినవి తన వ్యక్తగత ఆస్తులు కావని, సౌభాగ్య మీడియాలో తాను కేవలం వాటాదారుణ్ణి మాత్రమేనని నారాయణరావు స్పష్టం చేశారు. సౌభాగ్య మీడియా లిస్టెడ్ కంపెనీ అని... తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన అంటున్నారు. తనపై కుట్రజరుగుతోందని మేస్త్రీ వాపోతున్నారు. ఎప్పుడూ ధరించే తెల్ల దుస్తులకు అంటుకున్న బొగ్గు మసిని దాసరి తుడిచేసుకోగలరా? లేదా బొగ్గుల మేస్త్రీగానే చరిత్రలో నిలిచిపోతారా...? కాలమే నిర్ణయించాలి.