శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (07:06 IST)

ఏపీ హైకోర్టు ఎక్కడ ఉండాలో 6 నెలల్లో తేల్చండి..

రెండు హైకోర్టులు హైదరాబాద్‌లో ఉండడం సాధ్యం కాదు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం. ఇక ఆంధ్రప్రదేశ్‌‌కు హైకోర్టు ఎక్కడ ఉండాలో ఆరు నెలల్లోపు ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని రెండు రాష్ట్రాల ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పరస్పరం సంప్రదించుకోవాలని తెలిపింది.
 
దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి. భోసాలే, జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేసింది. నాలుగు అంశాలకు సంబంధించి కాల పరిమితి విధించింది. మే 1న జారీ చేసిన ఆదేశాలలో... ‘‘హైదరాబాద్‌లో రెండు రాష్ర్టాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయడం చట్ట సమ్మతం కాదు. హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతంకాదు. ఈ నగరం తెలంగాణలో అంతర్భాగం. ఏపీకి హైకోర్టు ఏర్పడేంత వరకూ ఇక్కడ ఉమ్మడిగానే ఉండాలి! కావాలంటే సర్క్యూట్‌ బెంచ్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు’’ అని తీర్పు చెప్పింది. 
 
ఇప్పుడు... ఇదే తీర్పులో నాలుగు కీలకమైన అంశాలకు న్యాయస్థానం కాల పరిమితి విధించింది. ఏపీలో హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలో ఒక నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ విషయాన్ని ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలపాలని... ప్రధాన న్యాయమూర్తి ఏపీ ముఖ్యమంత్రితో సంప్రదించి శాశ్వత హైకోర్టు భవనం ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. 
 
హైకోర్టు భవనం, పరిపాలనా భవనం, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, కోర్టు ఆఫీసర్లు, ఇతర సిబ్బంది నివాస గృహాలు (స్టాఫ్‌ క్వార్టర్స్‌) ఎక్కడెక్కడ ఉండాలనేది... కోర్టు ఆదేశాలు అందిన ఆరు నెలల్లోగా దీనిపై నిర్ణయం తీసుకుంటే మంచిదని అభిప్రాయపడింది.