శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 10 జనవరి 2017 (14:55 IST)

ఏపీలో ఇక డిజిటల్ తరగతి గదులు... తొలిదశలో 4000

ఏపీలో విద్యా వ్యవస్థ కొత్తరూపు సంతరించుకోనుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్య అందించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ తరగతుల ద్వారా విద్యార్థులు ప్రతి

ఏపీలో విద్యా వ్యవస్థ కొత్తరూపు సంతరించుకోనుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్య అందించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ తరగతుల ద్వారా విద్యార్థులు ప్రతి అంశాన్ని త్వరగా అవగాహన చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆధునిక విధానంలో సరికొత్తపంథాలో  విద్యార్థులు పాఠాలను తెరపై వీక్షిస్తారు.  ప్రతి అంశానికి సంబంధించిన విషయాలను దృశ్యరూపంలో చూస్తే అది వారికి గుర్తుండిపోతుంది.


రాష్ట్రంలో 44,385 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రాధమికంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 3,500 పాఠశాలల్లో, మునిసిపాలిటీలలోని 478 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ పాఠశాలలను ప్రాధమిక విద్యాశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖలు ఎంపిక చేస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లె మండలం మోరీ గ్రామంలో గత నెలలో మొదటి డిజిటల్ క్లాస్ రూమ్‌ని ప్రారంభించారు.
 
4వ ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్లాస్ రూములను ప్రారంభిస్తున్నారు. ఒక్కో తరగతి గది డిజిటలీకరణకు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇందు కోసం దాతల సహకారం కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.  జన్మభూమి సభల సందర్భంగా డిజిటల్ క్లాస్ రూమ్ ల భావనకు మంచి స్పందన వచ్చింది. అనేక గ్రామాల్లో డిజిటల్ తరగతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించటానికి దాతలు ముందుకు వచ్చారు.
 
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగేలా కృషి
ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగేలా విద్యార్థులకు ఇన్ ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీని ఉపయోగించి విద్యాబోధన జరిపి, ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలందరూ చదువుకునే రోజులు రావాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. ఇక్కడ చదివే విద్యార్థులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ పాఠశాలలకు వెళుతుంటారు.  వీరికి తెలివితేటలు, పట్టుదల ఎక్కువ.  సరైన విధంగా శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయన్నది ప్రభుత్వ భావన. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడంలో ఏపీఎస్ఎఫ్ఎల్ కీలక పాత్ర పోషిస్తోంది. విద్యార్థులందరికీ ఉన్నతమైన, ఉత్తమైన, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్(ఎన్ డీఎల్ఎం)ను అమలు చేయడంలో దేశంలో ఏపీ ముందు వరుసలో ఉండేవిధంగా ప్రణాళికలు రూపొందించారు.  డిజిటల్ ప్రపంచానికి కావలసిన నైపుణ్యాన్ని విద్యార్థులు అభివృద్ధి చేసుకోవడానికి ఈ తరగతి గదులు ఉపయోగపడతాయని ఏపీఎస్ఎఫ్ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ చెప్పారు.
 
4వేల డిజిటల్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటుకు టెండర్లు
రాష్ట్రంలో 4వేల డిజిటల్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటుకు పాఠశాల విద్యా శాఖ తరపున ఏపీఎస్ఎఫ్ఎల్(ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్వర్క్ లిమిటెడ్) టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆర్ఎఫ్‌పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రొపోజల్)లో తెలిపిన వివరాల ప్రకారం డిజిటల్ క్లాస్‌రూమ్ ఏర్పాటుకు కావలసిన పరికరాలు సరఫరా చేయడంతోపాటు క్లాస్ రూమ్ డిజైన్ రూపొందించి కావలసిన పరికరాలన్నీ అమర్చాలి. ఆ తరువాత దాని పర్యవేక్షణ కూడా వారే చూడాలి. క్లాస్ రూమ్‌లో ఉపయోగించే క్లౌడ్ ప్రాతిపదిక సాఫ్ట్ వేర్ కూడా వారే సమకూర్చవలసి ఉంటుంది. ఒప్పందం కుదిరిన ఏడాది లోపల 4 వేల క్లాస్ రూమ్‌లను డిజిటల్ రూమ్ లుగా రూపొందించవలసి ఉంటుంది. 
 
డిజిటల్ క్లాస్ రూమ్స్
డిజిటల్ క్లాస్ రూమ్స్‌లో ఆన్లైన్లో, ఆఫ్లైన్లో విద్యా బోధన చేస్తారు. నిపుణుల ఉపన్యాసాలను వీడియోల ద్వారా విద్యార్థులకు చూపుతారు. పాఠ్యాంశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి హాజరు వివరాలు అందుబాటులో ఉంటాయి. పాఠశాల, క్లాస్ రూమ్, విద్యార్థులు, పాఠ్యాంశాల పరిస్థితిని గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. తరగతి తీరు, జరిగిన పాఠ్యాంశాల ఆధారంగా ఉపాధ్యాయుల పనితీరుని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటారు. ఐటీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో కూడా విశ్లేషిస్తారు. క్లాస్ రూమ్ తీరుని అంచనా వేస్తారు. ఈ డిజిటల్ వ్యవస్థలో తరగతి రూమ్‌తోపాటు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో స్టూడియోలు ఉంటాయి. డిజిటల్ పాఠ్యాంశాలను భద్రపరచడానికి రాష్ట్ర స్థాయిలో ఒక డిజిటల్ లైబ్రరి వంటిది ఉంటుంది. డిజిటల్ క్లాస్ రూమ్స్ ని పర్యవేక్షించే వ్యవస్థ ఒకటి ఉంటుంది. అలాగే ఈ డిజిటల్ విద్యా వ్యవస్థ మొత్తానికి ఒక డ్యాష్ బోర్డుని కూడా రూపొందిస్తారు. వివిధ స్థాయిలలో జరిగే విశ్లేషణల ఆధారంగా ఒక నివేదికను తయారు చేస్తారు.
 
డిజిటల్ క్లాస్ రూమ్ లో స్క్రీన్ తోపాటు ఒక ప్రొజెక్టర్ ఉంటుంది. సీపీఈ, వై-ఫై, స్పీకర్స్ అందుబాటులో ఉంటాయి. ఒక ల్యాప్ టాప్, కెమెరా, మైక్ తోపాటు యుపిఎస్ ని కూడా ఉంచుతారు. రాష్ట్రస్థాయి డిజిటల్ స్టూడియోలో డిజిటల్ వీడియో కెమెరాలు, టెలీఫోన్స్, ఆడియో మిక్సెర్స్, వైర్ తోనూ, వైర్ లేకుండా మైక్రోఫోన్లు, డిస్ల్పే యూనిట్స్, ఆడియో, వీడీయో డిస్ట్రిబ్యూటర్లు, మల్టీటచ్ పేనల్, మీడియా రికార్డర్, నెట్ వర్క్, ఫర్నీచర్, యుపిఎస్, రికార్డింగ్ సొల్యూషన్ ఉంటాయి. జిల్లా స్థాయి స్టూడియోలలో కూడా అక్కడి అవసరాలకు అనుగునంగా  దాదాపు ఇవే ఉంటాయి.