గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 2 జులై 2015 (12:47 IST)

ఓడిపోయినా ప‌ద‌వులిచ్చాం... గుర్తులేదా..! మీరు ప‌చ్చి అవ‌కాశ‌వాదులు....డిగ్గీరాజా

బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ‌, డి.శ్రీ‌నివాస్‌లాంటి వారు కూడా పార్టీని త‌ప్పుబ‌డితే ఇంత‌కంటే విశ్వాస‌ఘాతుకం మ‌రోటి ఉండ‌ద‌ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్ అన్నారు. బొత్స, డీఎస్‌ లాంటివారు ఈ స్థాయికి వచ్చారంటే కారణం కాంగ్రెస్‌. ఇద్దరూ పీసీసీ అధ్యక్షులుగా, మంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. ఇది సరికాదని ఆయ‌న‌ మండిపడ్డారు. 
 
బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీనియర్‌ నాయకుడైన డి.శ్రీనివాస్‌ పార్టీని వీడుతారని తాననుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌కు ఆయన వీర విధేయుడని, పార్టీ కూడా డీఎస్‌ సేవలకు తగిన గుర్తింపు ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని, పార్టీలోనూ ముఖ్యమైన స్థానాన్ని కట్టబెట్టామని దిగ్విజయ్‌ చెప్పారు. ఈసారి మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలన్న పార్టీ విధాన నిర్ణయంలో భాగంగా డీఎస్‌ నామినేట్‌ చేసిన మహిళకే ఎమ్మెల్సీ పదవి ఇచ్చామన్నారు. 
 
ఈసారి మహిళకు అవకాశం ఇస్తున్నామని తాను డీఎస్‌కు ముందుగానే చెప్పానన్నారు. కాగా, పార్టీలో తన ఎదుగుదలను దిగ్విజయ్‌ సింగ్‌ అడ్డుకుంటున్నారని డీఎస్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, డీఎస్‌ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, ఒకవేళ ఆయన అందుకు వ్యతిరేకంగా భావిస్తుంటే చింతిస్తున్నానన్నారు.