గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 21 జులై 2016 (13:16 IST)

ఏపీకి స్పెషల్ స్టేటస్ ప్రైవేట్ బిల్లుకు కరుణ కుమార్తె కనిమొళి మద్దతు!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేట్ బిల్లుకు మద్దతు కూడగట్టుకునే పని వేగవంతంగా జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేట్ బిల్లుకు మద్దతు కూడగట్టుకునే పని వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రత్యేక కోసం దేశంలోని కొన్ని పార్టీల మద్దతుతో పాటు ఇతర రాష్ట్రాల సపోర్ట్ కూడా చాలా ఆవశ్యకం. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్‌కు ఇప్పటికే బీజేపీ మినహా ఏపీలోని అధికార పార్టీ టీడీపీ సహా అన్ని పార్టీలు కేవీపీ బిల్లుకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఇక సభలో ప్రైవేట్ బిల్లును ఎలాగైన ఆమోదింపజేసేందుకు తీర్మానించుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు పలు పార్టీ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా గురువారం తమిళనాడు విపక్ష పార్టీగా ఉన్న డీఎంకే ఎంపీ, కరుణ కుమార్తె కనిమొళిని కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. ఈ భేటీ సందర్భంగా కనిమొళిని ఏపీ స్పెషల్ స్టేటస్ బిల్లుకు మద్దతివ్వాల్సిందిగా కోరారు. కాంగ్రెస్ పార్టీ నేతల విజ్ఞప్తికి కనిమొళి సానుకూలంగా స్పందించారు. సభలో బిల్లు ఓటింగ్‌కు వస్తే అనుకూలంగా ఓటేస్తామని కనిమొళి హామీ ఇచ్చారు. దీనితో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఆశలు మరింత బలపడ్డాయి.
 
మరోవైపు కేవీపై ప్రైవేటు బిల్లుకు తెదేపా సహకరిస్తుందని ఆ పార్టీ నేత బొండా ఉమ ప్రకటించారు. ప్రైవేటు బిల్లు వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని.. అయితే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బిల్లుకు సహకరించాలని నిర్ణయించామన్నారు. ఎన్డీయే భాగస్వామ్యంలో ఉన్నప్పటికీ ఒత్తిడి పెంచేందుకు బిల్లుకు సహకరిస్తామని బొండా ఉమ వెల్లడించారు. ఇప్పటికే సీపీఐ పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపింది.