శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (09:26 IST)

డాలర్ శేషాద్రికి గుండెపోటు.. ఆస్పత్రిలో చికిత్స... చంద్రబాబు ఆరా!

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక అధికారిగా సేవలు అందిస్తోన్న డాలర్ శేషాద్రికి బుధవారం మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది. ఆయనను వెంటనే తిరుమలలోని అశ్విన్ ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని టీటీడీ ప్రజాసంబంధాల (పీఆర్ఓ) అధికారి తెలిపారు. 
 
నిజానికి డాలర్ శేషాద్రి గత కొంతకాలంగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. నెలక్రితం కిడ్నీ సంబంధింత సమస్యలు కూడా ఉత్పన్నమయ్యాయి. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు ప్రస్తుతం అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. మరోవైపు శేషాద్రి ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఆయనకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 
 
కాగా, శేషాద్రికి గతంలో రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని, కిడ్నీ సమస్యలు కూడా తలెత్తాయని వైద్యులు గుర్తించారు. 66 యేళ్ల డాలర్ శేషాద్రి 1977 జనవరి 26న టీటీడీలో ఉత్తర పారుపత్తేదార్ (లెక్కలు రాసే గుమాస్తా)గా విధుల్లో చేరారు. తర్వాత సీనియర్ అసిస్టెంట్, పదోన్నతిపై పారుపత్తేదారుగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 2006లో ఉద్యోగ విరమణ తర్వాత ఆలయ ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా 2014 జూలై 4వ తేదీ వరకు కొనసాగే అవకాశం దక్కింది.