మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PYR
Last Modified: మంగళవారం, 27 జనవరి 2015 (08:50 IST)

తెలుగు రాష్ట్రాల నడుమ ఎం‘సెట్’.. ముఖ్యమంత్రుల ముందుకు మూడు ప్రతిపాదనలు

ఎంసెట్ వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇదే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్ వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. చాలా సేపు దీనిపై చర్చించినట్లు అర్థమవుతోంది. మధ్య మధ్యలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రాల అధికారులతో కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. 
 
తొలత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహిస్తున్నందున ఎంసెట్‌ను కూడా వేర్వేరుగా నిర్వహిస్తేనే బాగుంటుందని ప్రతిపాదించారు. అయితే ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు, ఎంసెట్‌కు హాజరవుతున్న విద్యార్థులు ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశాలు పొందారని, ఆ సమయంలో ప్రత్యేక ఎంసెట్‌ ఉంటుందన్న విషయం వారికి చెప్పలేదని ఏపీ సీఎం చంద్ర బాబు అన్నట్లు తెలుస్తోంది.
 
విడివిడిగా ఎంసెట్‌ను నిర్వహిస్తే ఏపీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న ఎంసెట్‌కు హాజరవుతూనే ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తామని ప్రభుత్వం తెగేసి చెప్పడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని ఆయన గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఎంసెట్‌పై వారి ముందు మూడు ప్రతిపాదనలు ఉంచానని గుర్తు చేశారు. 
 
ఇందులో మొదటిది తొలి సంవత్సరం తెలంగాణ, వచ్చే విద్యాసంవత్సరం ఏపీ ప్రభుత్వం ఎంసెట్‌ను నిర్వహించడం. రెండోది ఈ యేడు తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్‌ను నిర్వహించి వచ్చే యేడాది కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి అనుగుణంగా జరుపాలని సూచించినట్లు సమాచారం. మూడో ప్రతి పాదనగా రెండు రాష్ట్రాల ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించి చైర్మన్‌గా తెలంగాణ ప్రభుత్వం, వైస్‌ చైర్మన్‌గా ఏపీ ప్రభుత్వానికి చెందిన అధికారులను నియమించడం.
 
చంద్రబాబు జోక్యం చేసుకుని విభజన చట్టంలో రానున్న పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలు నిర్వహించాలన్న నిబంధన ఉందని, దీనిని పాటిం చాలని గవర్నర్‌ను కోరారని తెలుస్తోంది. ఎంసెట్‌ విషయంలో ఇరు ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ సూచించారని తెలుస్తోంది. తాను జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులుఎంసెట్‌పైనే తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారని గవర్నర్ ముఖ్యమంత్రులకు చెప్పినట్లు సమాచారం. దీనిని దృష్టిలో పెట్టుకుని ఒక పరిష్కారానికి రావాలని వారిద్దరిని ఆయన కోరారు.