గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 15 నవంబరు 2016 (16:47 IST)

అమరావతికి తరలివస్తున్న విద్యా సంస్థలు... వివరాలు ఇవే...

నూతన రాజధాని అమరావతిని వచ్చే అయిదేళ్లలో ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రముఖ విద్యా సంస్థలు చొరవ చూపుతున్నాయి. తాత్కాలిక సచివాలయం నిర్మాణం తరువాత ఇక్కడ విద్యా నగరానికే పునాది పడింది. ప్రభుత్వంతోపాటు ప్ర

నూతన రాజధాని అమరావతిని వచ్చే అయిదేళ్లలో ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రముఖ విద్యా సంస్థలు చొరవ చూపుతున్నాయి. తాత్కాలిక సచివాలయం నిర్మాణం తరువాత ఇక్కడ విద్యా నగరానికే పునాది పడింది. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. భూ కేటాయింపులు, వెంటనే నిర్మాణాలు చేపట్టి, 2017కి అడ్మిషన్లు జరగాలన్న ప్రభుత్వ నిబంధనలు కూడా ఇందుకు ఒక కారణంగా భావించవచ్చు. అమరావతిలో మొట్టమొదటి విద్యా సంస్థకు ఈ నెల 3 శంకుస్థాపన జరిగింది. ఐనవోలు గ్రామంలో తమిళనాడుకు చెందిన ప్రతిష్టాత్మకమైన వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. 
 
ఈ విశ్వవిద్యాలయం కోసం ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. తొలిదశలో 100 ఎకరాల్లో  నిర్మాణం చేపట్టారు. ఇక్కడ విశ్వవిద్యాలయంతోపాటు ఒక మెడికల్ కాలేజీని కూడా ప్రారంభిస్తారు. అమరావతిలో నిర్మించే ప్రాంగణంలో 2017 బీటెక్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఇక్కడ 8 రకాల కోర్సులను ఆఫర్ చేస్తోంది. మెకానికల్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(సీఎస్ఈ), సీఎస్ఈ (డేటా ఎనలిస్టిక్స్), సీఎస్ఇ (నెట్ వర్క్ అండ్ సెక్యూరిటీ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తోపాటు సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్ డీ కోర్సులు ఉంటాయి.  భవిష్యత్ లో ఈ విశ్వవిద్యాలయంలో ప్రతి ఏటా 32 వేల మంది వరకు సాంకేతి విద్యను అభ్యసించే అవకాశం ఉంది. ఈ శంకుస్థాపనతో  మరిన్ని విద్యా సంస్థలు నిర్మాణాలు మొదలుపెట్టనున్నాయి. విద్యా సంస్థలన్నింటిని ఐనవోలు, నీరుకొండ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అక్కడే భూములను కేటాయిస్తోంది.  
 
ఆరు పాఠశాలల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లు
రాజధానిలో 160కి పైగా ప్రాథమిక పాఠశాలలు, వందకు పైగా ఉన్నత పాఠశాలలు, 27 జూనియర్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వృత్తి విద్యా సంస్థలు మూడేసి చొప్పున ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. 25 నుంచి 30 వరకు పాలిటెక్నిక్ ఇన్ స్టిట్యూషన్స్ నెలకొల్పాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అమరావతిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆరు పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సీఆర్ డీఏ ఈ నెల 11న టెండర్లను కూడా  ఆహ్వానించింది. 
 
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎఫ్ఆర్ఎం విశ్వవిద్యాలయం అమరావతిలో తమ ప్రాంగణం శంకుస్థాపనకు సన్మాహాలు చేస్తోంది. ఐనవోలు గ్రామంలోనే ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలాన్ని ఈ నెల 10న  ఆ విశ్వవిద్యాలయం ప్రతినిధులు పరిశీలించారు. తొలి దశలో ఈ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం వంద ఎకరాల స్థలం కేటాయించింది. తరువాత మరో వంద ఎకరాలు కేటాయించే అవకావం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం(2017-18) నుంచే ఇక్కడ తరగతులు ప్రారంభించాలని ఎంఓయులో ప్రభుత్వం పేర్కొంది. దాంతో నిర్మాణాలు చేపట్టడానికి ఆ సంస్థ ప్రతినిధులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 24 లేక 25 తేదీలలో ఇక్కడ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. వచ్చే నెల ఏప్రిల్ నాటికి కొన్ని భవనాల నిర్మాణం  పూర్తి చేసి, తరగతులు ప్రారంభించాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. ఈ విశ్వవిద్యాలయంలో తొలి దశలో 17 వేల మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది. 
 
ప్రపంచస్థాయి వైద్య విద్యాలయం
ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మెగా వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మాతా అమృతానందమయి ట్రస్ట్ ఆధ్వర్యంలోని అమృత యూనివర్సిటీ ముందుకొచ్చింది. యూనివర్సిటీ ప్రతినిధులు గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు.  సంబంధిత ప్రాజెక్టు నివేదికను కూడా  వారు అందజేశారు. రూ.2,500 కోట్ల అంచనాతో విశ్వవిద్యాలయంతోపాటు 2,250 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పుతారు. ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రీసెర్చ్-హెల్త్   కేర్ క్యాంపస్‌ను సైతం ఏర్పాటు చేస్తారు. తొలి దశ మొదటి ఏడేళ్లలో 18 వేల మంది విద్యార్థులకు, రెండో దశ పూర్తి అయ్యేసరికి 47 వేల మందికి అవకాశం ఉంటుంది. ఈ విశ్వవిద్యాలయానికి తొలి దశలో 150 ఎకరాలు, రెండవ దశలో 50 ఎకరాలు ఇవ్వాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఇంకా పలు ప్రఖ్యాత విద్యా సంస్థలకు స్థలాలు కేటాయించే అవకాశం ఉంది. 
 
అమరావతిలో ప్రతిష్టాత్మకమైన ఫిక్కీ (ఎఫ్ఐసీసీఐ - ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ - భారతీయ పరిశ్రమలు, వాణిజ్య సమాఖ్య) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పై ఈ నెల 10న ఢిల్లీలో ఆ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. లండన్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ ప్రాంగణం కూడా ఇక్కడ నిర్మించే అవకాశం ఉంది. ఈ విషయమై ఆ విశ్వవిద్యాలయం ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు కూడా జరిపింది.   అమరావతిలో స్థలం ఇస్తే గీతం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ఆ విశ్వవిద్యాలయం ప్రో వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎన్.శివప్రసాద్ చెప్పారు. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులలో గీతం విశ్వవిద్యాలయ ప్రాంగణాలు ఉన్నాయి. దేశవిదేశాలకు చెందిన  ఉత్తమ విశ్వవిద్యాలయాలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. 
 
దేశంలో టాప్ 20, ప్రపంచంలో టాప్ 20 విశ్వవిద్యాలయాలను ఏపీకి తీసుకురావల్లన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. ఆ మేరకు ఇప్పటికే దేశవిదేశాలలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకోవడం, భూములు కేటాయించడం జరిగిపోయాయి. నిర్మాణ పనులు కూడా ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్ కు మొదటి దశలో 50,  రెండు దశలో 100 కలిపి మొత్తం 150 ఎకరాలు కేటాయించనున్నారు.  నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్(ఎన్ఐడీ)కి 50 ఎకరాలు, సెంట్రల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్ (సీఐటీడీ)కి ఐదు ఎకరాలు, ఆంధ్రప్రదేశ మానవ వనరుల అభివృద్ధి సంస్థకు 25 ఎకరాలు కేటాయించేందుకు సీఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఐదేళ్లలో అమరావతి ఒక ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా మారడం ఖాయమని భావిస్తున్నారు.