గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 21 మే 2015 (19:15 IST)

ఖాళీలు ఆరు.. పోటీలో ఏడుగురు... ఎన్నికలు తప్పనిసరి

తెలంగాణలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తమ సంఖ్యా బలానికి మించి టీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపింది. పోటీ తప్పనిసరి అయ్యే పరిస్థితి నెలకొంది. మొత్తం ఆరు ఖాళీలు వుండగా, బరిలో ఏడుగురు అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్‌, టీడీపీ నుంచి చెరొకరు, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఐదుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎత్తులు వేస్తోంది. 
 
ఉన్న సీట్లలో టీఆర్ ఎస్ నాలుగు సీట్లు, కాంగ్రెస్‌, టీడీపీలకు చెరో అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవకాశముంది. టీడీపీ నుంచి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి ఆకుల లలిత పోటీ చేస్తుండగా, టీఆర్‌ఎస్‌ నుంచి కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్‌, బి. వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు. నలుగుర్ని గెలిపించుకునే ఛాన్స్‌ మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో కేవలం నలుగురిని మాత్రమే బరిలోకి దింపుతారు. ఇది చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయం. కానీ టీఆర్ ఎస్ ఐదో అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో టీడీపీ, కాంగ్రెస్‌ లకు గుబులు పుట్టుకుంది. 
 
తమ ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్‌ బేరసారాలకు దిగుతోందని జంకుతున్నారు. ఇది అక్రమమని టీడీపీ, కాంగ్రెస్‌ మండిపడ్తోంటే, ఆ అవసరమే తమకు లేదన్నది టీఆర్‌ఎస్‌ వాదన. అయితే బరిలోకి దిగిన మంత్రి కడియం శ్రీహరి మాత్రం అసలు విషయం చెప్పేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తమకు ఓటేసే అవకాశం ఉందని ఆయనే చెప్పడంతో రాజకీయాలు వేడెక్కతున్నాయి. రహస్య ఓటింగ్ జరిగితే తమ అభ్యర్థుల పరిస్థితి ఏమిటని రెండు పార్టీలు జంకుతున్నాయి. 
 
సొంత బలంతో కాకుండా, వేరే బలాన్ని నమ్ముకునే టీఆర్‌ఎస్‌ ఐదో అభ్యర్థిని నిలబెట్టిందనే విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తోన్న కడియం, ఎమ్మెల్సీగా గెలిచిన వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో పోటీ నుంచి ఎవరైనా తప్పుకుంటే తప్ప, ఓటింగ్‌ తప్పనిసరవుతుంది. అప్పుడు ఎమ్మెల్యేలతో అన్ని పార్టీలు భేరసారాలకు దిగక తప్పదు.