బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (08:55 IST)

తొండంతో కొట్టి... కాళ్ళతో తొక్కి లైన్ వాచర్ ను చంపిన ఏనుగులు

ఏనుగులను అడవిలోకి తరిమేయాలని వెళ్ళిన ఓ ఫారెస్టు వాచర్ ను ఏనుగులు చంపేశాయి. వంద గ్రామస్తులు అక్కడకు చేరకున్నా లెక్కచేయక అందరిపైకి ఒక్క సారిగా తిరుగుబాటు చేశాయి. వాటిని అడవిలోకి పంపేందుకు అటవీశాఖ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏనుగులు ఓ ప్రాణాన్ని బలిగొన్నాయి. గురువారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, రామకుప్పం సమీపంలోని ననియూల అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నా యి.
 
గురువారం మధ్యాహ్నం ననియాల గ్రామానికి సమీపంలోని పొలం వద్దకు అడవిలోంచి ఏనుగుల గుంపు వచ్చింది. వాటిని తరిమేందుకు సహచరులు, గ్రామస్తులతో కలసి లైన్ వాచర్ మునెప్ప(42) వెళ్లాడు. ఓ పక్క టపాకాయులు పేల్చుతూ మరోపక్క ఏనుగులను అటవీ ప్రాంతానికి తరుముతుండగా ఏనుగులు ఒక్కసారిగా జనంపై తిరగబడ్డాయి. జనం ఏమిచేయాలో తోచక ఒకరిపై ఒకరు పడుతూ పరుగులు తీశారు. 
 
కానీ మునెప్ప మాత్రం అడవిలోని పొదలచాటునే చిక్కుకుపోయాడు. ఏనుగులు అతనిని చుట్టుముట్టాయి. ఆ సమయంలో ఓ ఏనుగు తొండంతో కొట్టి.., కాళ్ళతో తొక్కి మునెప్పను చంపేశాయి. తరువాత తాపీగా ఏనుగులు సమీపంలోని లోతట్టు ప్రాంతానికి వెళ్లిపోయాయి. ఇదిలా ఉండగా మునెప్ప బంధువులు కుప్పం ఫారెస్ట్ రేంజర్ కాలప్ప నాయుడు, సిబ్బంది వారిపై దాడికి పాల్పడ్డారు.  అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.